COVID in TS: కరోనా కేసుల్లో 'పొదుపు' పాటిస్తున్న తెలంగాణ, కొత్తగా మరో 1593 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 54 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య
COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, July 26: తెలంగాణలో కరోనావైరస్ కేసుల విషయంలో 'పొదుపు' కనిపిస్తోంది.  శనివారం విడుదల చేయాల్సిన హెల్త్ బులెటిన్ ను ఫార్మాట్ మార్పు పేరుతో తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది.

తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం శనివారం నాటికి తెలంగాణలో కొత్తగా మరో 1,593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య  54,059 కి చేరుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొవిడ్19 తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా నగరానికి ఎక్కువగా రాకపోకలు జరిగే జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రతిరోజు వచ్చే కేసులను గమనిస్తే స్పష్టమవుతోంది.

శనివారం నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 641 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 171 కేసులు, మేడ్చల్ నుంచి 91 , సంగారెడ్డి నుంచి 61  పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ. మహబూబ్‌నగర్ మరియు నిజామాబాద్ జిల్లాలలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. శనివారం వరంగల్ అర్బన్ నుంచి 131 కేసులు బయటపడగా,  కరీంనగర్ నుంచి 51 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక నిర్మల్ జిల్లా నుంచైతే గత కొన్నాళ్లుగా కేవలం 1 కేసు మాత్రమే నమోదవుతుండటంతో జిల్లా వాసులు ఆనందం, ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు నిన్న మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 463 కు పెరిగింది.

అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో  998 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 41,332 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,264 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో  15,654 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,53,425 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తెలంగాణ హెల్త్ బులెటిన్‌లో పారదర్శకత లోపించిందా?

మొదట్నించీ తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్వహించే టెస్టులపై మరియు నివేదించే కొవిడ్ గణాంకాలపై ఆరోపణలు ఉన్నాయి. హైకోర్ట్ కూడా ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులెటిన్ పై సీరియస్ అయింది. ప్రభుత్వం చెప్పే లెక్కల్లో పారదర్శకత కనిపించడం లేదని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేంధర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రోజూవారీ బులెటిన్ ఫార్మాట్లలో పలు మార్పులు చేస్తూ వచ్చింది. అయినప్పటికీ ఫార్మాట్లలో స్వల్ప మార్పులు జరిగాయి గానీ, చెప్పే గణాంకాలలో ఎలాంటి మార్పు రాలేదు. హెల్త్ బులెటిన్ ఫార్మాట్ మారుస్తున్నామని చెప్పి నిన్న విడుదల చేయని హెల్త్ బులెటిన్ ఈరోజు విడుదల చేశారు. తీరా అది కూడా కొంచెం అటు ఇటుగా పాత దానిలాగే ఉంది.

అయితే, ఒక మిలియన్ జనాభాకు సగటున 391 కొవిడ్19 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, అందుకు ఘనమైన సమర్థింపుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 140 టెస్టులు మాత్రమే సూచించిందని, తెలంగాణ WHO సూచించిన దానికంటే ఎక్కువగానే టెస్టులు చేస్తున్నట్లు అర్థం వచ్చేలా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణ నివేదించే హెల్త్ బులెటిన్‌లో పారదర్శకత లోపించిందని మీరు భావిస్తున్నారా?