Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత హైదరాబాద్ పర్యటనలో హైడ్రామా, గణేష్ నిమజ్జనంలో మాట్లాడుతుండగా స్టేజి మీదకు ఎక్కిన టీఆర్ఎస్ నేత, రెచ్చగొట్టేందుకే హిమంత వచ్చాడన్న తెలంగాణ మంత్రులు
ఆ తర్వాత మొజాం జాహీ మార్కెట్ కు వచ్చారు. మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు.
Hyderabad, SEP 09: హైదరాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ( Himanta Biswa Sarma) పర్యటన పొలిటికల్ రగడకు దారితీసింది. భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma)మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. దీనిపై టీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ (Mahamood ali). హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉండనీయరా అని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) ప్రశ్నించారు. హైదరాబాద్ లో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి తలసాని ఆరోపించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి అసోం సీఎం.. దేవుడు, భక్తి గురించి మాట్లాడడం మానేసి రాజకీయాలు మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు. బాధ్యత గల వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. నాలుగైదు రోజులుగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నా.. నిమజ్జన ఏర్పాట్లు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన హిమంత బిశ్వ శర్మ.. ఆ తర్వాత మొజాం జాహీ మార్కెట్ కు వచ్చారు. మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఉన్నట్టుండి శర్మ వెనుక నుంచి టీఆర్ఎస్ కార్యకర్త నందుబిలాల్ చొచ్చుకు వచ్చాడు. శర్మ ముందున్న మైక్‌ను తన చేతిలోకి తీసుకున్న అతడు శర్మతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు నందుబిలాల్‌ను అక్కడి నుంచి కిందకు దించి తరలించారు. ఆ తర్వాత శర్మ తన ప్రసంగాన్ని కొనసాగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.