Hyderabad, SEP 09: నైరుతి రుతుపవనాలు తెలంగాణపై (Telangana) చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు (Rains) దంచి కొడుతున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతుండడంతో శని, ఆదివారాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శుక్రవారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంటుందని, రానున్న 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా తీరాలకు దగ్గరలోఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.