Hyderabad, September 9: హైదరాబాద్‌ (Hyderabad)లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) తెలిపింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్‌ను కుమ్మేస్తున్న వర్షం

ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.  కర్ణాటక (Karnataka), దక్షిణ తెలంగాణ (South Telangana), ఉత్తర కోస్తా (North Kostha) మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వివరించింది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్పా, ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

అటు  ఏపీలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించింది.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలో విస్తృతంగా, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.  అటు, ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 4.15 లక్షల క్యూసెక్కులు కాగా, 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజి నుంచి 4.01 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.