
Amaravati,Sep 8: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో (Heavy Rains to lash in Telugu states) పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ముఖ్యంగా ఏపీలో (Andhra Pradesh) ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ నెల 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది.
హైదరాబాద్ సహా జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల పదో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు గురువారం హెచ్చరికలు జారీచేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నదని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. బుధవారం ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ, నారాయణపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి.