Hyderabad Gang Rape Case: తోటి విద్యార్థులే కామాంధులుగా మారి పదవతరగతి బాలికపై సామూహిక అత్యాచారం, రేప్ సీన్ వీడియో తీసి బెదిరిస్తూ మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
హయత్‌నగర్ తట్టిఅన్నారంలో పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి (Hyderabad Gang Rape Case) పాల్పడ్డారు.ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు (All Five Accused Arrested) చేశారు
Hyd, Mar 8: హయత్‌నగర్ తట్టిఅన్నారంలో పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి (Hyderabad Gang Rape Case) పాల్పడ్డారు.ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు (All Five Accused Arrested) చేశారు.వీరంతా సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.
హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తట్టి అన్నారంలోని ఓ పాఠశాలలో ఐదుగురు బాలురు పదో తరగతి చదువుతున్నారు. అశ్లీల వీడియోలకు బానిసలుగా మారిన వీరు.. తోటి విద్యార్థిని (17)పై కన్నేశారు. ఒకే తరగతి కావడంతో ఆ విద్యార్థిని వారితో సన్నిహితంగా ఉండేది. ఇదే అదనుగా ఆమెపై లైంగిక దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే బాధితురాలి ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడం.. ఆమె ఒంటరిగా ఉండటం చూసి.. ఈ ఐదుగురు బాలురు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితుల్లో ఒకడు సెల్‌ఫోన్‌లో రికార్డ్ కూడా చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాధితురాలు జరిగిన ఘాతుకాన్ని ఎవరికీ చెప్పకుండా మిన్నుకుండిపోయింది.
పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు.. ఆ వీడియోను బాధితురాలికి చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. మరోసారి అత్యాచారం చేసి, దీన్ని కూడా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియోను మిగిలిన నలుగురికి వాట్సాప్ ద్వారా షేర్ కూడా చేశాడు. ఇలా నిందితులు పలుమార్లు బెదిరింపులకు పాల్పడుతూ.. అత్యాచారం చేస్తుండటంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు గత ఆదివారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఐదుగురు నిందితులపై పోక్సో చట్టంతోపాటు అసభ్యకర వీడియోను చిత్రీకరించి, ఫార్వర్డ్ చేసినందుకు ఐటీ చట్టం సెక్షన్ 67ఏ, 67బీ కింద కూడా కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు 24 గంటల్లోనే ఐదుగురు మైనర్ నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. అనంతరం జువెనైల్ హోంకు తరలించారు.