Telangana: భార్య వివాహేతర సంబంధం, భర్తను చంపి ఆ శవాన్ని ఏడు ముక్కలుగా నరికి పారేసిన ఆమె ప్రియుడు, నా పేరు శివ సినిమా తరహాలో సాక్ష్యాలు మాయం, ఎట్టకేలకు పోలీసులకు దొరికిన నిందితుడు
ఈ హత్య కేసుకు సంబంధించి సోమవారం ఎన్టీపీసీ పోలీసు స్టేషన్ ఆవరణలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ( Commissioner of Police S Chandrashekhar Reddy) వివరాలను మీడియాకు వెల్లడించారు.
Hyd, Nov 30: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన కాంపెల్లి శంకర్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ హత్య కేసుకు సంబంధించి సోమవారం ఎన్టీపీసీ పోలీసు స్టేషన్ ఆవరణలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ( Commissioner of Police S Chandrashekhar Reddy) వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులకు (Peddapalli police) సాక్ష్యాలు దొరక్కుండా నిందితుడు డిటెక్టివ్ సినిమాను అనుసరించాడని సీపీ తెలిపారు.
మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హతుడి భార్య హేమలత, నిందితుడు పొయ్యిల రాజుకు మధ్య వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలిసింది.ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన కాంపెల్లి శంకర్ (Kampelli Shankar), హేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. శంకర్ గోదావరిఖనిలో మీసేవ కేంద్రంలో ఆపరేటర్‌గా, హేమలత ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. కాగా, అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న పొయ్యిల రాజుతో హేమలతకు వివాహేతర సంబంధం ఉన్నది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్న శంకర్‌ను అంతమొందించాలని రాజు నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం రెండు కత్తులను సైతం కొనుగోలు చేసి సమయం కోసం వేచిచూస్తున్నాడు. ఈ నెల 25న రాత్రి శంకర్-హేమలత మధ్య గొడవ జరిగింది. అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో శంకర్ బైక్‌పైన హేమలతను ఆస్పత్రిలో దింపాడు. రాత్రి 10:30 గంటల సమయంలో రాజుకు ఫోన్ చేసి ‘నీ వల్లే మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు’ అని చెప్పాడు. ఇదే అదునుగా భావించిన రాజు.. శంకర్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. అతిగా మద్యం తాగించాడు. రాత్రి 11 గంటల సమయంలో బీరు సీసాతో శంకర్ తలపై బలంగా కొట్టాడు.
స్పృహ కోల్పోగానే కత్తులతో విచక్షణారహితంగా నరికాడు. డిటెక్టివ్, నా పేరు శివ సినిమా తరహాలో హత్యకు సాక్ష్యాధారాలు దొరక్కుండా.. శంకర్ శరీరాన్ని ఏడు భాగాలుగా చేసి గోదావరిఖని, సప్తగిరికాలనీ, ఆర్టీసీ క్వార్టర్స్ వెనకాల పడేశాడు. కాగా, గురువారం రాత్రి బయటికి వెళ్లిన శంకర్ ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు సాయంత్రం తల్లి పోచమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేరోజు హేమలతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 27న ఉదయం శంకర్ శరీర భాగాలను గుర్తించి, మిస్సింగ్ కేసును హత్య కేసుగా తీసుకున్నారు. నిందితుడు రాజు ఆదివారం కరీంనగర్‌కు బైక్‌పై పారిపోతుండగా తెలంగాణ ప్రాజెక్టు చౌరస్తాలో పట్టుకున్నట్టు సీపీ తెలిపారు.