Telangana: వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా మారనున్నదని మంత్రి అన్నారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతాయని, ఇది మన రాష్ట్రానికే కాదు యావత్తు దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు.
Hyd, June 7: తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా మారనున్నదని మంత్రి అన్నారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతాయని, ఇది మన రాష్ట్రానికే కాదు యావత్తు దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు.
2014లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు ఉంటే.. నేడు రూ.13.27 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇది పారిశ్రామిక రంగంలో గణనీయమైన వృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికంగా 3.17 లక్షలు ఉన్నదని చెప్పారు. జాతీయ సగటు 1.70 లక్షలు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం టీ హబ్‌లో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొన్నారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ వార్షిక నివేదిక 2022-23, చేనేత, జౌళి శాఖల ప్రగతి నివేదికను వేర్వేరుగా ఆవిష్కరించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, ‘తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ఇది ట్రయల్ మాత్రమే. రాబోయే పదేండ్లలో అద్భుతమైన ప్రగతిని చూస్తారు.’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోటీ పడేందుకు హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిందని వెల్లడించారు. భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్, అతిపెద్ద ఫార్మా క్లస్టర్, స్టెంట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
2014లో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉంటే.. తొమ్మిదేండ్లలోనే రూ.2.41 లక్షల కోట్లకు చేరుకొన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపచంలోనే అతిపెద్ద టీ-హబ్, ప్రొటో టైపింగ్ సెంటర్ టీ -వర్క్స్‌ను ఏర్పాటు చేసుకొన్నట్టు చెప్పారు. ఇమేజ్ ఇన్నోవేషన్ సెంటర్‌కూడా ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. జీనోమ్ వ్యాలీ తరహాలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టు సైతం విజయం సాధిస్తుందని అన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన అనూహ్యమైన ప్రగతికి గర్వపడుతున్నానని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం కృషి చేసిన పరిశ్రమలు, ఐటీ, ఈ అండ్ సీ, టెక్స్‌టైల్స్ శాఖలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఉత్తమ ఉద్యోగులను మంత్రి కేటీఆర్ సతరించారు.
రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక ప్రగతిని సాధించే లక్ష్యంతో సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధితో కూడిన తెలంగాణ నమూనాను అమలు చేస్తున్నామని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం, ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలోనే అగ్రగామి ప్రాజెక్టులుగా నిలిచాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులు.. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని బేరీజు వేసుకోవాలని అన్నారు.
అమెరికాలో లేని పారిశ్రామిక విధానం మన సొంతం: మంత్రి కేటీఆర్
తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి విని అమెరికా పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధిలో ప్రపంచానికి బెంచ్ మార్క్‌గా నిలువటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా టీఎస్‌ఐఐసీ, టీఐఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం దండుమల్కాపూర్‌లోని ఎంఎస్‌ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పారిశ్రామిక ప్రగతి వేడుకలు నిర్వహించారు.మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని 51 పరిశ్రమలను ప్రారంభించడంతోపాటు 106 ఎకరాల్లో నిర్మించనున్న టాయ్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.
స్థానిక పారిశ్రామికవేత్తల కోరికమేరకు కొయ్యలగూడెం నుంచి దండుమల్కాపూర్ ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌కు నీటిని సరఫరా చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వెంటనే అధికారులకు ఆదేశాలిస్తున్నామని పేర్కొన్నారు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో త్వరలో రైస్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్ల టన్నులకు పెరగటం అతిగొప్ప విజయమని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి 9.05 లక్షలకు పెరిగిందని వివరించారు.