Hyderabad: సాఫ్ట్‌వేర్ ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్, దుర్గం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు
అది తప్పని గ్రహించి వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదానికి గురై ఓ యువకుడు మరణించాడు.
Hyd, Maay 15: చేరాల్సిన ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా వెతుక్కుంటూ బయల్దేరిన ముగ్గురు దారితప్పారు. అది తప్పని గ్రహించి వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదానికి గురై ఓ యువకుడు మరణించాడు. మెహిదీపట్నం-శంషాబాద్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబరు 84 వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎంహెచ్‌ఎన్‌వీఎస్. చరణ్(22) ప్రాణాలు కోల్పోయాడు. వాహనం వెనుక కూర్చున్న మరో ఇద్దరు యువతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంహెచ్‌ఎన్‌వీఎస్ చరణ్(22) స్వస్థలం కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామం. బీటెక్ పూర్తి చేసి పోచారం వద్ద ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ సమీపంలోని టౌన్‌షిప్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో నగరం చూద్దామని శనివారం స్నేహితులతో కలిసి బైక్‌లపై బయల్దేరారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితురాళ్లను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు చరణ్.
గురుద్వారాలో మద్యం తాగిందని తుపాకీతో కాల్చి చంపిన సేవాదార్, ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలు
ట్యాంక్ బండ్ మీద ఉన్నవి చూసుకుని.. దుర్గం చెరువు తీగల వంతెన చూద్దామని బయల్దేరారు. దారి తెలియక గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. ముందు రెండు బైక్‌లు వెళ్లిపోగా.. గూగుల్ మ్యాప్‌ను అనుసరించి ఆరాంఘర్ వద్ద బైక్‌ను పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గం వైపు మళ్లించాడు. అయితే రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్లాక తప్పు దారిలో వెళ్తున్నట్లు గుర్తించారు. బండిని యూటర్న్ తీసుకున్నాడు.
గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న ఓ కారు చరణ్ నడుపుతున్న బండిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చరణ్ రోడ్డుమీద కొద్దిసేపు కొట్టుమిట్టాడాడు. నిస్సహాయ స్థితిలో రక్తపు చేతులతో అక్కడికి వచ్చిన వారి పాదాలు పట్టుకొని కాపాడమంటూ సైగలు చేశాడు. ఆ సమయంలో రక్షించకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి వైరల్ చేశారు. ఈలోపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన చరణ్‌ను, స్వల్పంగా గాయపడిన అతని స్నేహితురాళ్లను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ చరణ్.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మెహిదీపట్నం-శంషాబాద్ వరకు 11.6 కిలోమీటర్ల మేర పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఈ మార్గంలో కార్లు, ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే బస్సులు ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. పర్యవేక్షణ లోపంతో కొందరు ద్వి, త్రి చక్ర వాహనదారులు ఆ రూట్‌లో ప్రయాణిస్తున్నారు.