KCR Warns AP Govt: 'ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలను ఆపకపోతే...' ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ వార్నింగ్, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు కాదు, క్రమశిక్షణ పాటించాలని సూచన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే.. తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా.. కృష్ణా నదిపై అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు....

Telangana CM KCR | File Photo

Hyderabad, October 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదని, క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని కేసీఆర్ హెచ్చరించారు. మంగళవారం ప్రగతి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, తెలంగాణ వైఖరిని స్పష్టంగా తెలియజేశారు.

రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీఎస్ సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు,వాటాల గురించి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోపాటు, "దిగువ రాష్ట్రం" అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లకు తెలంగాణ వైఖరిని విస్పష్టం చేశారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. భారత యూనియన్ లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైనవాటాను పొందే హక్కు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామ’’ ని సీఎం స్పష్టం చేశారు.

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఈ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదని, అయినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డి పాడును మరింత విస్తరించడాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో  సీఎం కేసీఆర్ స్పష్టంచేసిన అంశాలు:

‣ తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండు చేశారు.

‣ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రారంభంలోనే, అనగా 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956-సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాము కేంద్రానికి లేఖ రాశామని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చేత, ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని సీఎం పేర్కొన్నారు. తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. కాగా, కేంద్రమంత్రి షెకావత్.. తెలంగాణ డిమాండ్ ను అంగీకరిస్తామంటూనే... సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్, కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే.. సుప్రీం కోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు.

‣ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 కింద కృష్ణా నదీ జలాల వివాద ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడిటి-2)కు ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్’ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి కోరారు.

‣ అంతర బేసిన్లలోనే నదీ జలాలను తరలించాలనే జల న్యాయ సూత్రాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశం దృష్టికి తెచ్చారు. ‘‘ ఒక నదీ బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరినంకనే, ఇంకా అదనపు జలాలుంటేనే బేసిన్ అవతలికి నదీ జలాలను తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి’’ అని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గ నిర్దేశనాలను ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. ఈ నేపథ్యంలో బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఆంధ్ర ప్రదేశ్ కు లేదనీ, ఇదే విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖతోపాటు కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్ కు స్పష్టం చేయడాన్ని సరైన చర్యగా  కేసీఆర్ అభివర్ణించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం వాదనతో కేంద్రమంత్రి కూడా ఏకీభవించారు.

‣ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని, తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నదీమీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కాగా, డీపీఆర్ లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరడం పట్ల సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేననీ, ఇందులో రహస్యం ఏమీ లేదని, కాకపోతే నిర్మాణ క్రమానికి అనుగుణమైన స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండటం వలన డీపీఆర్ లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందని, అంతేతప్ప డీపీఆర్ లు సమర్పించడానికి తమకు ఏ అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.

‣ గోదావరి నదిపై, (జీడబ్లూడీటీ) అవార్డు ప్రకారం, నాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవహిస్తున్న మొత్తం నీటిని వినియోగించుకోవచ్చని వుందని.. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే 1956 చట్టం కింద ట్రిబ్యునల్ కు నివేదించుకోవచ్చన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి రెండు రాష్ట్రాలు కలిసి లేఖ ఇస్తే.. గోదావరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

‣ తమ అభ్యంతరాలతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర జల్ శక్తి మంత్రి ఈ ఏడాది ఆగస్టు 20న లేఖ రాసిన సంగతిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం ఇంత స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు కొనసాగించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం పంపిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నఅక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

‣ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే.. తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా.. కృష్ణా నదిపై అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు.

‣ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని అయితే, బోర్డులు సమర్ధవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.

‣ నాలుగేండ్ల కింద మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని, నేటి రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిపిన చర్చను తీసుకున్న నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం కేసీఆర్, సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినట్స్ ను అధికారికంగా విడుదల చేయాలన్నారు. కాగా, ఆరేండ్లుగా పెండింగులో ఉన్న సెక్షన్ 3 ద్వారా ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసే అంశం తెలంగాణ వత్తిడి మేరకు 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారం కావడం తెలంగాణకు సాగునీటి జలాల వినియోగం విషయంలో మేలు చేకూర్చే అంశమన్నారు. తద్వారా తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులందరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

Share Now