IIIT Basara Student Dies: బాసర త్రిపుల్ ఐటీలో వరుస మరణాలు, రెండు రోజుల్లోనే ఇద్దరు విద్యార్ధినులు మృతి, నాలుగో అంతస్తు నుంచి కిందపడి స్టూడెంట్ మరణం, ఆత్మహత్య కాదు ప్రమాదమే అంటున్న యాజమాన్యం, పోలీసుల దర్యాప్తు
దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతిచెందింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతిచెందింది. విద్యార్థిని స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం. లఖిత హాస్టల్ నాలుగో అంతస్తుపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.
Nirmal, June 15: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో (IIIT) మరో విషాదం చోటుచేసుకుంది. దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు (student dies) పాల్పడిన ఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతిచెందింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతిచెందింది. విద్యార్థిని స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం. లఖిత హాస్టల్ నాలుగో అంతస్తుపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. కానీ, యాజమాన్యం, సిబ్బంది మాత్రం ఆమె ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి పడి మృతిచెందినట్లు చెబుతున్నారు. భవనంపైనుంచి పడటంతో లిఖితకు తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, మెరుగైన చికిత్సకోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించే క్రమంలో విద్యార్థిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని బాసర ట్రిపుల్ ఐటీ (IIIT Basara) సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు.
లిఖిత నిజంగానే భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ పడిందా? ప్రమాదవశాత్తూ పడిఉంటే నాలుగో అంతస్తుకు ఎందుకు వెళ్లింది? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారమే పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్ లో చున్నీతో ఉరేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీపిక మృతి ఘటన మరువక ముందే మరో విద్యార్థిని మృతి చెందడటంతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గతేడాదికూడా విద్యార్థులు కొంతమంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. అయితే, వీరు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గతంలో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తెలిపింది. తాజా ఘటన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. లఖిత మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది.