IIT Student Graze Goats: మేకల కాపరిగా ఐఐటీ విద్యార్థి , సీన్ కట్ చేస్తే అండగా సీఎం రేవంత్ రెడ్డి, నేనున్నా అంటూ భరోసానిచ్చిన కేటీఆర్
చదువుకోవాలనే కోరిక ఉన్నా పేదరికం కారణంగా చదువు కొనే స్థోమత లేక గొర్రెల కాపరీగా మారింది. కానీ సీన్ కట్ చేస్తే చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఉన్నత చదువుల వైపు అడుగేసింది.
Siricilla, July 25: ఆమె చదవుల తల్లి, కానీ పేదరికం ఆమె పాలిటి శాపమైంది. చదువుకోవాలనే కోరిక ఉన్నా పేదరికం కారణంగా చదువు కొనే స్థోమత లేక గొర్రెల కాపరీగా మారింది. కానీ సీన్ కట్ చేస్తే చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఉన్నత చదువుల వైపు అడుగేసింది.
వివరాల్లోకి వెళ్తె... తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గోనె నాయక్ తండా ఉంది. రాములు, సరోజ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతుళ్లు ఇద్దరు డిగ్రీ పూర్తిచేయగా మూడో కూతురు మధులత ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. పేదరికం వెంటాడుతున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా చదువులో మాత్రం వెనుకగడు వేయలేదు. చదువుల్లో టాపర్‌గా నిలిచింది. ఐఐటిల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ లోనూ సత్తాచాటింది. ఎస్టీ కేటగిరిలో 824 ర్యాంకు రాగా పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది.
ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడ చేరేందుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ అంత డబ్బు లేకపోవడం, తండ్రి రాములు అనారోగ్యం పాలుకావడంతో చేసేదేమి లేక మేకల కాపరిగా మారింది. అయితే ఆమెకు ఓ లెక్చరర్ అండగా నిలిచి ఆమె కష్టాలను సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు చేరింది.
సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు మధులతను అభినందించిన రేవంత్ ... ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందించారు. గిరిజన శాఖ కార్యదర్శి శరత్ రూ 1,51,831 చెక్కును అందజేశారు. అలాగే కేటీఆర్ సైతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులు తానే చూసుకుంటానని ప్రకటించారు. మొత్తంగా సోషల్ మీడియా, ఓ లెక్చరర్ పుణ్యమాని ఉన్నత చదువులు చదవాలనే కోరిక నెరవేరింది.