Metallo Beta Lactamase: హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని చెరువల్లో, చుట్టుపక్కల కుంటల్లో ప్రమాదకర బ్యాక్టీరియాని (Metallo Beta Lactamase) పరిశోధకులు కనుగొన్నారు.
Hyderabad, April 11: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని చెరువల్లో, చుట్టుపక్కల కుంటల్లో ప్రమాదకర బ్యాక్టీరియాని (Metallo Beta Lactamase) పరిశోధకులు కనుగొన్నారు. గ్రేటర్ సిటీ వ్యాప్తంగా చెరువులు, కుంటల నుంచి నీటి శాంపిల్స్ తీసుకుని పరీక్షించగా అందులో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1 (New Delhi Metallo-Beta-Lactamase 1) అనే జన్యువు గల బ్యాక్టీరియాను గుర్తించామని హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు (IIT scientists) చెప్తున్నారు. ఈ తరహా బ్యాక్టీరియా పెరగడానికి కారణం సిటీలో గృహ, పారిశ్రామిక కాలుష్యమేనని వారు చెబుతున్నారు.
మురుగు వ్యర్థాలు, భార లోహాలు అధికంగా ఉన్న నీటిలో ఈ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని, ఇది యాంటీ బయాటిక్స్‌కు సైతం లొంగని మొండిరకమని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. ఆయా చెరువులు, కుంటల్లో నీటిని తాగినా, ఇతర ఏ అవసరాలకు వినియోగించినా డయేరియా, అంటు వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు.
అయితే ఈ బ్యాక్టీరియా భూగర్భజలాల్లో కలిసే అవకాశం లేదని హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శశిధర్ తెలిపారు. అయినప్పటికీ చెరువులు, కుంటల నుంచి వివిధ మార్గాల్లో చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆయా జలాశయాల్లో నీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తాకవద్దని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ పరిధిలో సుమారు 185 చెరువులున్నాయి. వాటిలో సగం చెరువుల్లోకి (Hyderabad City Lakes) గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు వచ్చి కలుస్తున్నాయి. అంబర్‌పేట ఎస్టీపీ, దుర్గం చెరువు, అమీన్‌పూర్, అల్వాల్, హుస్సేన్‌సాగర్, మోమిన్‌పేట్, సరూర్‌నగర్, ఫాక్స్ సాగర్, కంది, మీరాలం, నాగోల్, ఉప్పల్ నల్లచెర్వు, సఫిల్‌గూడ చెరువుల్లో నీటి నమూనాలను సేకరించిన ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల బృందంఈ నీటిపై పరీక్షలు జరిపింది. ఈ నీళ్లలో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు కలిగిన కొత్త రకం బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించింది.
ఊరట కలిగించే విషయం ఏంటంటే.. మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తదితర మంచినీటి జలాశయాల్లో నమూనాలను కూడా పరీక్షించారు. వాటిలో ఈ బ్యాక్టీరియా ఉనికి బయటపడలేదు. దీనిపై జలమండలి ఎండీ దానకిశోర్ స్పందించారు. మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, గోదావరి (ఎల్లంపల్లి), కృష్ణా మూడుదశల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న నీటిని 3 దశ ల్లో శుద్ధి చేస్తున్నాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు క్లోరినేషన్, బూస్టర్ క్లోరినేషన్ నిర్వహణతో ఇక్కడి తాగునీటి నాణ్యతపై జలమండలికి ఐఎస్‌వో ధ్రువీకరణ లభించింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తు న్న తాగునీటికి సంబంధించి ఐదువేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నాం. ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదు. తాగునీటి నాణ్యతపై అనుమానాలు, అపోహలకు తావులేదని తెలిపారు.
ఈ జన్యువు ఉన్న బ్యాక్టీరియా చాలా మొండిదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియాతో చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చిన వారికి సాధారణంగా వైద్యులు ఇచ్చే యాంటీ బయాటిక్స్ పనిచేయవని చెప్తున్నారు. కలుషిత జలాలు చేరిన చెరువుల నీటిని తాకడం, బట్టలు ఉతకడం, స్నానం చేయడం, ఆ జలాశయాల్లోని చేపలను తినడం, ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల బ్యాక్టీరియా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఆయా జలాశయాల వద్ద గడపవద్దని కూడా వారు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే రోజువారీగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వెలువడుతున్న 1,400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మేర మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.