
New Delhi, Mar 24: దేశమంతా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ఊపందుకున్న నేపథ్యంలో చాలామందికి అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. ఎవరు వ్యాక్సిన్ (Coronavirus vaccination) తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే ఈ టీకాను (COVID 19 vaccine) తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇస్తున్నారు.
చాలా మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు కరోనా టీకాతో (Coronavirus Vaccine) పాటు ఆయా జబ్బులకు కూడా ఔషధాలు తీసుకోవచ్చా? తీసుకుంటే టీకా పనిచేస్తుందా? ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయా? అనే ప్రశ్నలకు వైద్యులు కొన్ని సలహాలు చెప్పారు. అవేంటో ఓ సారి చూద్దాం.
రక్తాన్ని పలుచన చేసే ఔషధాలు, డెర్మా ఫిల్లర్ల వాడకం వారు టీకా తీసుకుంటే స్వల్ప స్థాయిలో దద్దుర్లు, వాపు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.అయితే, ఇది అందరిలో సంభవించకపోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. కాబట్టి వైద్యుల సలహాతో తీసుకోవాలని వారు సూచించారు.
టీకా తీసుకున్న సమయంలో ఇతర అనారోగ్యాలనికి వాడే మందులు ఆపేయాలా అనే విషయంలో కూడా వైద్యులు సలహా ఇచ్చారు. వాటిని ఆపాలా వద్దా అనేది వాడుతున్న ఔషధాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విషయంలో వైద్యుల సలహా తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహ సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో రోగనిరోధక వ్యవస్థ నెమ్మదిగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో ఇతర మందులు వాడే వారిలో కరోనాను ఎదుర్కోగలిగే రోగనిరోధక శక్తి కాస్త ఆలస్యంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
థైరాయిడ్ ఔషధాలు వాడుతున్నవారు వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. థైరాయిడ్‌ను నియంత్రించే రోగనిరోధక వ్యవస్థ, సూక్ష్మజీవులతో పోరాడే వ్యవస్థ రెండూ చాలా భిన్నమైనవి. ఈ నేపథ్యంంలో టీకా వల్ల వృద్ధి చెందే రోగనిరోధక శక్తికి ఎలాంటి అవాంతరం ఉండదని వైద్యుల అభిప్రాయంగా చెబుతున్నారు.
అలర్జీలు, ఆస్తమాతో బాధపడుతున్నవారిలో కూడా టీకా వల్ల ఎలాంటి సమస్య తలెత్తడం లేదని గుర్తించినట్లు వైద్యనిపుణులు తెలిపారు. అయితే టీకా తయారీలో వినియోగించిన పదార్థాల వల్ల అంతకుముందే ఎవరికైనా అలర్జీలు తలెత్తిన చరిత్ర ఉంటే టీకా తీసుకోవద్దని సూచించారు.
గుండె సంబంధిత సమస్యలు, గుండె పోటు, రెనల్ ఫెయిల్యూర్ (కిడ్నీ వైఫల్యం) వంటి సమస్యలు గతంలో తలెత్తి శస్త్రచికిత్స తీసుకున్నవారు సాధారణ ఔషధాలతో పాటే టీకా తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవడానికి వారం నుంచి పది రోజుల ముందు ఎవైనా తీవ్ర సమస్యలు ఏర్పడితే మాత్రం టీకా తీసుకోవడాన్ని వాయిదా వేస్తే మంచిదని వైద్యులు తెలిపారు.
ఇక క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకోవడం ప్రారంభించని వారు టీకా తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అలాగే క్యాన్సర్ నుంచి కోలుకున్నవారు కూడా టీకా తీసుకోవచ్చని తెలిపారు.
కీమోథెరపీ వంటి చికిత్సలో ఉన్నవారు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించారు. ఈ విషయంలో వైద్యుల సలహాననుసరించాలన్నారు.