Monsoon Alert: నైరుతీ రుతుపవనాలు మరింత ఆలస్యం, సముద్రపు గాలులు మందగించడమే కారణమన్న హైదరాబాద్ వాతావరణశాఖ, ఎండలు దంచికొట్టడం ఖాయమన్న ఐఎండీ అధికారులు
అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రండైరక్టర్ నాగరత్న తెలిపారు. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేదన్నారు.
New Delhi, June 08: నైరుతి రుతుపవనాలు (monsoon) మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) డైరక్టర్ నాగరత్న తెలిపారు. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేదన్నారు. ఈ రెండు సముద్రాల్లోని గాలులు బలంగా ఉన్నప్పుడు అవి కలుస్తాయని, అప్పుడు సముద్రంలోని తేమ భూమి మీదకు వస్తుందని, దీంతో నైరుతి రుతుపవనాలు (South west monsoon) వేగంగా విస్తరిస్తాయన్నారు. ఈ గాలులు రెండు, మూడు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 12 నాటికి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నాగరత్న పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయన్నారు. బుధవారం 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైగా నమోదయ్యాయని టీఎస్‌డీపీఎస్ తెలిపింది. ఐదు జిల్లాల్లో 39 డిగ్రీలపైన, 3 జిల్లాల్లో 38 డిగ్రీలపైన, 2 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16 జిల్లాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వ 3.80, మొగలమడ్క 2.98 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.