Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయిన ప్రస్తుత సీజే జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు.
Hyderabad, Jan 1: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లిని (Justice Hima Kohli) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు. గత 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలిజీయం వీరి బదిలీలను కేంద్రానికి సిఫార్సు చేయగా.. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోదించడంతో అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ హిమా కోహ్లి తెలంగాణ హైకోర్టుకో తొలి ప్రధాన మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమ... ప్రాథమిక విద్యను సెయింట్ థామస్ పాఠశాలలో, ఉన్నత విద్యాభ్యాసాన్ని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. ఢిల్లీ బార్‌కౌన్సిల్‌లో 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1999–2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక ప్రజాహిత వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలితోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా హిమా కోహ్లి నియమితులయ్యారు. ఆ తర్వాత 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా, జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ధర్మాసనం ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీచేసింది.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను (Justice Raghavendra Singh Chauhan) ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. దీనిని సైతం ఆమోదిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ కర్ణాటక హైకోర్టు నుంచి 2018 నవంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 ఏప్రిల్ 3న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అదే ఏడాది జూన్ 22న పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయశాఖలో సిబ్బంది కొరతను నివారించేందుకు భారీగా నియామకాలు చేపట్టారు. అలాగే న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు కృషి చేశారు. ఆయన హయాంలో సచివాలయం కేసు, ఎర్రమంజిల్ కేసు, ఎమ్మెల్సీల అనర్హత, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువడ్డాయి.