Kondagattu Temple Burglary Case: కొండగట్టు అంజన్న బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు వీళ్లే, అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు, కేసు వివరాలు నేడో రేపో వెల్లడించే అవకాశం
ఈ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు.
Kondagattu, Sep 27: తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు.
కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో దొంగలు పడి సుమారు 15 కేజీల వెండి , బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్వామి వారి 2 కేజీల మకర తోరణం , అర్థమండంలోని స్వామి వారి 5 కేజీల వెండి ఫ్రెమ్, 3 కేజీల నాల్గు శఠగోపాలు , స్వామి వారి 5 కేజీల తొడుగు ఇలా మొత్తంగా 15 కేజీల వెండి వరకు చోరీ అయ్యినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..దొంగలను కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుండి 60 శాతం చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జగిత్యాల పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. కాగా దొంగతనానికి సంబంధించి దేవస్థానం అధికారులు ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులపై వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకే వారిని సస్పెండ్ చేసినట్టు దేవస్థానం అధికారులు వివరించారు
చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి.. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. అనంతరం, మెయిన్‌రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్‌పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ నుండి బీదర్ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్ ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.