KTR: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం..పోయింది అధికారమే కానీ పోరాడేతత్వం కాదన్న కేటీఆర్, రసమయి రూపొందించిన పాట రిలీజ్

తెలంగాణ ప్రజల కోసం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అంతే నిబద్దతతో పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.

KTR releases Rasamayi Balakishan Song(X)

Hyd, Dec 7:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కెసిఅర్ పదవి త్యాగం నుంచి మొదలైన పార్టీ ప్రయాణం ఆయన ప్రాణత్యాగం దాకా సాగిందని, అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పోయింది అధికారమే, కానీ ప్రజల కోసం పోరాడే పార్టీ లక్షణం కాదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అంతే నిబద్దతతో పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేసిన అవినీతిని, ప్రజలకు పెట్టిన ఇబ్బందులపై మా పార్టీ చేసిన పోరాటానికి, ఆందోళనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని కేటీఆర్ అన్నారు. గత ఏడాది కాలంలో జరిగిన సంఘటనలు, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులు, పోలీసు కేసుల పేరుతో చేసిన కుట్రలను అన్నింటిని దాటుకొని ఈ రోజు భారత రాష్ట్ర సమితి తిరిగి బలంగా నిలబడిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నదన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి గురయ్యిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేటీఆర్ అన్నారు.

ఈ రోజు పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్మించిన "నమ్మి నానపోస్తే" అనే షార్ట్ ఫిలిం ని కేటీఆర్ విడుదల చేసి, పార్టీ నేతలతో తిలకించారు. 22 నిమిషాల పాటు సాగిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుత తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి మోసపోయి గోసపడుతున్న తెలంగాణ సమాజం తీరును రసమయి బాలకిషన్ కళ్ళకు అద్దినట్లు ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారని కేటీఆర్ అన్నారు.  రాహుల్ గాంధీపై దుష్ప్రచారం..గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు చేయాలని హయత్‌నగర్ పీఎస్‌లో కంప్లైంట్ 

రసమయి బాలకిషన్ "అంతా ఉత్తదే" పేరుతో రూపొందించిన మరో గీతాన్ని కూడా కేటీఆర్ విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ మరియు పాటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వదిలిపెట్టి ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరించినట్లు రసమయి బాలకిషన్ తెలిపారు. ప్రతినెల ఇదేవిధంగా, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని, మోసాలను వివిధ రూపాల్లో గుర్తు చేస్తామని కేటీఆర్ కి రసమయి బాలకిషన్ తెలిపారు.