MMTS Train Crash: కాచిగూడ ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనలో ఇంకా క్యాబిన్‌లోనే ఉండి పోయిన లోకో పైలట్, బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రెస్క్యూ సిబ్బంది, సురక్షితంగానే ఉన్నాడంటున్న అధికారులు
అతడు ఇంకా క్యాబిన్ లోనే ఉన్నాడు, అతడ్ని బయటకు తీసే ప్రయత్నాలు రెండున్నర గంటలుగా కొనసాగుతున్నాయి. పోలీసులు అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం అతడు సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తుంది....
Hyderabad, November 11: కాచిగూడ స్టేషన్ (Kachiguda Station)వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో సిగ్నలింగ్ వ్యవస్థను నియంత్రించే అధికారుల నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు మాత్రం సిగ్నల్ గమనించకుండా లోకో పైలట్ (Loco Pilot) రైలును ముందుకు కదిలించడం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.
ఈ ఘటనపై రైల్వేశాఖ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సిబ్బంది నిర్లక్ష్యమా, లేక సిగ్నలింగ్ లో లోపమా? తేలాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి కర్నూల్ వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిలిచిన ట్రాక్ పైకే, ఎంఎంటీఎస్ (MMTS) రైలుకు సిగ్నల్ వచ్చింది. దీంతో ఎంఎంటీఎస్ రైలు నేరుగా వచ్చి ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు పెద్దగా నష్టం జరగనప్పటికీ, ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లు దెబ్బతిన్నాయి, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే స్టేషన్ ను సమీపించడం కారణంగా ఎంఎంటీఎస్ రైలు నెమ్మదిగా ప్రయాణించడం మరియు మరో రైలు నిలిచి ఉండటం చేత పెను ప్రమాదం తప్పిందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఒకేసారి వేగంగా ప్రయాణించి ఉన్నట్లయితే పరిస్థితి భయంకరంగా ఉండేదని చెప్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది క్షతగాత్రులకు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒక ప్రయాణికుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు, ఎంఎంటీఎస్ క్యాబిన్ లో ఇరుక్కున్న లోకో పైలెట్ ను శేఖర్ గా గుర్తించారు. అతడు ఇంకా క్యాబిన్ లోనే ఉన్నాడు, అతడ్ని బయటకు తీసే ప్రయత్నాలు రెండున్నర గంటలుగా కొనసాగుతున్నాయి. పోలీసులు అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం అతడు సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అధికారుల మాటలకు లోకో పైలట్ లోపలి నుంచి స్పందిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతడికి లోపలికి ఆక్సిజన్ మరియు తాగేందుకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు.