CM KCR Speech in Nagarkurnool: కాంగ్రెస్ రాజ్యం అంటే దళారీ భోజ్యం, తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, నాగర్ కర్నూల్ స్పీచ్ హైలెట్ ఇవిగో..
నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రాజ్యం అంటే దళారీ భోజ్యమని, వాళ్లకు మళ్లా అధికారం ఇస్తే పంటికి అంటకుండా మింగేస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Nagarkurnool, June 7: నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రాజ్యం అంటే దళారీ భోజ్యమని, వాళ్లకు మళ్లా అధికారం ఇస్తే పంటికి అంటకుండా మింగేస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో నెలకొన్న దుస్థితిని గుర్తుచేస్తూనే.. ధరణి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందో వివరించారు.
రైతు పేరిట ఉన్న భూమి మార్చేందుకు ఇప్పుడు ఎమ్మార్వో, మంత్రి, చివరకు ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదని, ధరణితో కేవలం రైతు బొటన వేలికే భూముల రికార్డులు మార్చే అధికారం ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ధరణి తీసేస్తే రైతులు మళ్లీ పంట డబ్బుల కోసం చిట్టీలు పట్టుకుని సేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగానే రైతుబంధు కింద పెట్టుబడి సాయం, రైతు చనిపోతే రూ.5 లక్షలు, వడ్లు అమ్మితే పంట డబ్బులు వెంటనే అందుతున్నాయని తెలిపారు.
బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వస్తే ఈ ప్రాంతం కారుచీకటి అవుతుంది.. మీకు కరెంటు రాదని శాపాలు పెట్టారు. తెలంగాణ నేడు 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో ధగధగ మెరిసిపోతోంది. అదే ఆంధ్రాలో చిమ్మ చీకటి అలుముకుంది. ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 24 గంటలూ విద్యుత్తు ఇచ్చే దిక్కులేదు. రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇచ్చే వ్యవస్థ కూడా ఎక్కడా లేనేలేదు. తెలంగాణలో ఇంతటి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టుకోవద్దు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, భారాస జిల్లా కార్యాలయాలను సీఎం మంగళవారం ప్రారంభించారు. ధరణిలో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని, ఒకరో ఇద్దరో మిగిలి ఉంటే వాళ్ల సమస్యలూ పరిష్కారమవుతాయన్నారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా, వారు వలస పోకుండా చూడాలి. సాగుకు సరిపడా కరెంటు ఇవ్వాలి. ఇదే మా లక్ష్యం’ అని వివరించారు.
గిరిజనులకు పోడు భూములు పంచుకుంటున్నాం. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం పెట్టాం. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు. ఆ ప్రకారం ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు 4వేల చొప్పున ఇళ్లు ఇస్తాం. కులవృత్తులు చేసుకునే బీసీలను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.లక్ష ఇచ్చే పథకం ఈ నెల 9న ప్రారంభమవుతుంది. ఇలా మానవీయ కోణంలో పరిపాలన కొనసాగిస్తున్నాం. కులం లేదు. మతం లేదు. ప్రజలందరూ తెలంగాణ బిడ్డలు. అందరూ మంచిగా బతకాలి. కంటి వెలుగు పథకం ద్వారా కోట్ల మందికి పరీక్షలు చేయించాం.
లక్షల మందికి కళ్లద్దాలు ఇస్తున్నాం. ఇది రైతులు, పేదలు, దళితులు, గిరిజనుల ప్రభుత్వం. పాలమూరు జిల్లా కన్నీటిని తుడిచి ఈ ప్రాంతాన్ని పంటల భూమిగా మార్చడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం. ఆ సంతోషం గుండెల నిండా ఉంది. మీ ముందు ఒకటే శపథం చేస్తున్నా. ఏ పని తలపెట్టినా భగవంతుడు నన్ను ఓడించలేదు. గెలిపించాడు. పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. నార్లపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ జలాశయాల ద్వారా 75-80 టీఎంసీల నీటిని నింపుకొంటాం. ఇవి ఒక్కసారి నిండితే పాలమూరు బంగారు తునక అవుతుంది. ఆగస్టులో ఈ జలశయాలను నీళ్లతో నింపబోతున్నాం. పాలమూరు జిల్లాలో ఎక్కడా నీటి ఇబ్బంది మాటే లేకుండా చూస్తాం.
మీరే నా బలగం, బంధువులు. మీ ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ధరణి పోర్టల్ ఉండాలి. ప్రస్తుతం రైతు భూమిని మార్చాలంటే వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ కూడా మార్చలేరు. గతంలో రికార్డు అసిస్టెంటు, రెవెన్యూశాఖ రాసిందే రాత. ఇప్పుడు భూమిని మార్చే అధికారం కేవలం రైతుకే ఇచ్చాం. పైరవీకారులు, లంచగొండులు, ఎవరైతే రైతుల రక్తం తాగారో వాళ్లే ధరణిని రద్దు చేయాలంటున్నారు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పండి. నిమిషాల్లో పరిష్కారం చేస్తారు. కాంగ్రెస్ పాలనలో ఆపద్బంధు అని ఉండేది. రైతు చనిపోతే కేవలం రూ.50 వేలు ఇస్తామని చెప్పేవారు. బాధితులు చెప్పులరిగేలా తిరిగితే రూ.10 వేలో.. రూ.20 వేలో చేతిలో పెట్టి పంపించేవారు. ఏనాడూ పూర్తిసొమ్ము రాలేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తాగునీరు, సాగునీరు, కరెంటు కోసం అరిగోస పెట్టింది. నేను పాలమూరు ఎంపీగా ఉంటే వారి సమస్యలు తెలుస్తాయని ప్రొ.జయశంకర్ అన్నారు. ఆ రోజుల్లో ఉద్యమం బలంగా లేకపోయినా.. పాలమూరు ప్రజలు ఎంతో ప్రేమతో నన్ను గెలిపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు శాశ్వతంగా నిలిచిపోతుంది. అనేక సంక్షేమ పథకాల్లో ఎవరి ఊహకు అందని విధంగా ఏటా రూ.50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను అమలు చేస్తున్నాం. దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నాం. భారాస వచ్చిన తర్వాత పాలమూరు పచ్చబడింది. గత ప్రభుత్వాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరును ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఇక్కడ సభలు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఒక్కరైనా పాలమూరుకు వైద్య కళాశాలను తీసుకొచ్చారా? పాలమూరు పేరు చెప్పి బిల్‌క్లింటన్, ప్రపంచ బ్యాంకులను తీసుకొచ్చారు. ఇక్కడి ప్రజల పరిస్థితి మాత్రం మారలేదు. నాడు వలస పోయిన పాలమూరు జిల్లాకు నేడు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ నుంచి కూలీలు నాట్లు వేయడానికి వస్తున్నారు. ఇది నిజంగా గర్వకారణం. ఒకప్పుడు ఎకరం రూ.10 వేలు పలికిన భూములు నేడు రూ.50 లక్షలు, రహదారి పక్కనుంటే రూ.రెండు, మూడు కోట్లు పలుకుతున్నాయి. ప్రజలు పల్లెల్లో రూ.లక్షలు పెట్టి ఘనంగా బొడ్రాయి పండగ చేసుకుంటున్నారు’ అని సీఎం అన్నారు. ‘వలసలతో వలవలపించు కరవు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీరు జలకం ఆడి పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకొంది’ అనే పాట తానే రాశానని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
కంటివెలుగు పథకం తీసుకొచ్చినం. లక్షలాది మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చినం. ప్రభుత్వం ఇలా చేస్తదని గతంలో ఎవరైనా ఊహించారా? ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు గతంలో ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చిండ్రా? దేశంలోని మరే రాష్ట్రంలోనైనా ఇట్లా ఇస్తున్నారా? వేదనలో, బాధలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆలోచించాం. చాలా మేధోమథనం, ఆలోచన తర్వాత ఈ పథకాలు చేపట్టాం. ప్రజలందరనీ కాపాడుకోవాలన్న మానవీయ దృక్పథంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అసహాయులకు, నిస్సాహుయల కోసం పనిచేస్తున్నది.
ధరణిలో ఏమైనా సమస్యలుంటే మీ అధికారులకు, మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి. వారు వాటిని పరిష్కరించేందుకు సహాయం చేస్తారు.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. జై తెలంగాణ.. జై భారత్ నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)