Heavy Rain Alert: తెలంగాణలో విస్తారంగా వర్షపాతం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మరో రెండు రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక
వరదలకు సంబంధించి ఏదైనా అత్యవసర సహాయం కోసం 100 లేదా 040-29555500 డయల్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు...
Hyderabad, July 16: రాబోయే 48 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఒడిశా మీదుగా విదర్భ వరకు 18 డిగ్రీల లాటిట్యూడ్ వద్ద అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, మరికొన్ని ప్రాంతాల్లో మితమైన మోస్తారు వర్షపాతం నమోదు కావొచ్చని ఐఎండీ అంచనావేసింది.
బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు హైదరాబాద్‌లో సగటున 68.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుఅయింది, నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హయత్‌నగర్, ఉప్పల్, సరూర్‌నగర్, సైదాబాద్‌లకు, మారేడ్ పల్లి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లో భారీ వర్షాలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, డిఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరదలకు సంబంధించి ఏదైనా అత్యవసర సహాయం కోసం 100 లేదా 040-29555500 డయల్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు
రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా మారాయి. శుక్రవారం నుంచి రాబోయే రెండు రోజుల వరకు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్ తదితర ఉత్తర,తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదు కావొచ్చని అలాగే ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.