Bus Catches Fire: ఎండాకాలం ఏసీ బస్సు ప్రయాణాల్లో జాగ్రత్త, హైదరాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు

మార్గమధ్యంలో ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులు తలెత్తినా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎంతమాత్రం స్పందిచవు.....

Private Travel Bus Caught Fire near Hyderabad | Photo: Twitter

Hyderabad, March 13: ముంబై- హైదరాబాద్ (Mumbai- Hyderabad) మధ్య నడిచే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (Orange Travels Bus) శుక్రవారం ఉదయం నడిరోడ్డుపై దగ్ధమైంది. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈరోజు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి గురువారం రాత్రి బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం ఉదయం 9:30 సమయంలో హైదరాబాద్ శివారులో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వద్దకు రాగానే బస్సు ముందు భాగంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.  దీంతో ప్రయాణికులందరూ భయంతో కిందకు దిగారు, ఆ తర్వాత క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధం అయింది.

ఆ సమయంలో బస్సులో ఉన్న సుమారు 26 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే వారికి చెందిన లగేజీ మంటల్లో కాలిపోయినట్లు సమాచారం.

రాత్రి బయలుదేరిన బస్సు హైదరాబాద్ సమీపంలోకి రావడం, అప్పటికే తెల్లవారిపోవడంతో ప్రయాణికులందరూ మెలకువతో ఉన్నారు. ఈ క్రమంలోనే వారు వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడుకోగలిగారు. అదే ఈ ప్రమాదం ఏ అర్ధరాత్రో, తెల్లవారుఝామున అయ్యుంటేనో ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది.

ఆర్సీ పురం పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం ఇంజిన్ లో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.

ఏది ఏమైనా ఎండకాలంలో ఏసి బస్సుల్లో, అన్నింటికంటే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించేటపుడు అప్రమత్తంగా వ్యవహరించడం మంచింది.

ప్రైవేట్ ట్రావెల్స్ వారు ప్రయాణికుల భద్రత నియమాలు ఏవీ పాటించకుండా, ధనార్జనే ధ్యేయంగా బస్సులకు విశ్రాంతి లేకుండా ట్రిప్పులు నడపడం వల్లే ఈ లాంటి ప్రమాదాలకు కారణమవుతాయి. మార్గమధ్యంలో ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులు తలెత్తినా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎంతమాత్రం స్పందిచవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిది.