PV Sindhu: బతుకమ్మ సంబరాల్లో మెరిసిన సింధు, చివరి రోజుకు చేరుకున్న బతుకమ్మ ఉత్సవాలు, ప్రధాన ఘట్టం సద్దుల బతుకమ్మకు తెలంగాణా రెడీ, వేడుకకు ముస్తాబైన ట్యాంక్‌బండ్

ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా జరపనున్నారు.

Pv-sindhu-at-bathukamma-celebrations ( Photo-twitter)

Hyderabad,October 6:  మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు ఫైనల్‌కి చేరాయి. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా జరపనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు వెలుగులతో దర్శనమిస్తున్నాయి. ఈ రోజు పదివేల మంది మహిళలు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలను పేర్చి, 30 అడుగుల బతుకమ్మ శకటంతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి శోభ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మంత్రులు, మహిళా మంత్రులు, విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరుకానున్నారు.

తెలంగాణా బతుకమ్మ సంబరాల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు సందడి చేసింది. అంబర్ పేట మున్సిపల్ మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి పీవీ సింధు బతుకమ్మ వేడుకలకు హాజరైంది. మహిళలతో కలిసి ఆడిపాడింది. తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలను తెలిపింది. ఈ సంధర్భంగా అమ్మాయిలు క్రీడల్లో సత్తా చాటాలని చెబుతూ మోడీ తీసుకువచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో పివి సింధును కిషన్ రెడ్డి దంపతులు సన్మానించారు.

బతుకమ్మ సంబరాల్లో పీవీ సింధు

నేటి సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మొదలయ్యే సద్దుల బతుకమ్మ సంబరాలు ట్యాంక్ బండ్ మీదుగా సాగి బతుకమ్మ ఘాట్ వరకూ కొనసాగుతాయి. అక్కడ ఆటపాటల తర్వాత సద్దుల బతుకమ్మను నిమజ్జనంతో ఘనంగా సాగనంపనున్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో వీటిని నిర్వహించనున్నారు. ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో వేల మంది కళాకారులు బతుకమ్మల ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజలంతా తరలిరావాలని ప్రభుత్వం కోరింది.

సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఆడపడచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపిచ్చారు. చెరువుల దగ్గర నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జోన్ నుంచి వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరయ్యేలా 120 వాహనాలను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేసింది.

చివరిరోజైన సద్దుల బతుకమ్మ ప్రత్యేకత వేరని చెప్పవచ్చు. ఈ రోజు రకరకాల సద్దులు, సత్తులను ప్రసాదాలుగా పెట్టి, బతుకమ్మ నిమజ్జనం తర్వాత వాయినాలుగా ఇచ్చుకుంటారు. ఐదు రకాల సద్దులు, ఐదు రకాల సత్తుపిండితో పాటు మలీద లడ్డూలు తయారుచేస్తారు.