Gurukul School Staff Harass Students: విద్యార్థినులకు పురుగుల అన్నం, టీచర్లకు పరమాన్నం..ఇది గురుకులాల పరిస్థితి, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, తట్టుకోలేక రోడ్డెక్కిన విద్యార్థినులు!
తాజాగా రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది.
Hyd, Aug 30: తెలంగాణలో పాలన పడకేసిందా?, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారేలేరా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది.
ఇదేంటి అని నిలదీసిన విద్యార్థులను బండబూతులు తిడుతూ పైశాచికాన్ని ప్రదర్శించారు. అవసరమైతే ఇంటి నుండి ఆహారం తెచ్చుకోవాలని ఇంకా ఎక్కువ చేస్తే పరీక్షల్లో మేము ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు సిబ్బంది.
దీంతో గత్యంతరం లేక విద్యార్థినులు రోడ్డెక్కారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి దర్నా చేశారు. తమకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని ఆరోపించారు విద్యార్థినులు. పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..
Here's Video:
కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదు.. రాష్ట్రంలో ప్రజల మీద ప్రతీకార పాలన సాగుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ప్రతీకార పాలన నడుస్తోందని.. కేసీఆర్ గురుకుల విద్యాలయాలను 250 నుండి 1000 వరకు పెంచి, దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దితే.. గురుకులాలను పూర్తిగా విస్మరిస్తున్నది రేవంత్ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా స్పందించిన హరీశ్.. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారని హరీష్ రావు వెల్లడించారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితుల గురించి ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు.