Vande Bharat Express Timings, Route: వందేభారత్ ట్రైన్ ప్రత్యేకతలు తెలుసా? సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే మార్గం, ఆగే స్టేషన్లు ఇవే! ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వందేభారత్
ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది
Hyderabad, JAN 13: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (Vande Bharat Express) ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ (Modi) ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తొలుత ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన ఈ రైలును సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజులుగా ముందుగానే అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఈ రైలు నంబర్, ఆగే స్టేషన్లు, కాలపట్టిక వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.
అయితే ప్రారంభం రోజున మాత్రమే ఈ స్టేషన్‌లలో ఆగుతుంది. రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 16వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad) నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఇందులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ ట్రైన్ ను తీర్చిదిద్దారు. ఇందులో కూర్చొనే ప్రయాణం చేయాలి. పడుకునే వీలుండదు. దాదాపు అంతా పగటి పూట ప్రయాణమే కాబట్టి స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయలేదు.