IPL Auction 2025 Live

Epuri Somanna To Join In BRS: బీఆర్‌ఎస్‌లోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న, సింగర్‌ సాయిచంద్‌ స్థానాన్ని భర్తీ చేస్తారా?మంత్రి కేటీఆర్‌తో భేటీ, ఆత్మీయ ఆలింగనం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ల సమక్షంలో ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌ను (KTR) ఆలింగనం చేసుకున్నారు.

Epuri Somanna To Join In BRS

Hyderabad, SEP 22: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న (Epuri Somanna) త్వరలోనే బీఆర్‌ఎస్‌లో (BRS) చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ల సమక్షంలో ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌ను (KTR) ఆలింగనం చేసుకున్నారు. ఇరువురూ పరస్పర క్షేమసమాచారాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను త్వరలో పార్టీలో చేరనున్నట్టు ఏపూరి సోమన్న ప్రకటించారు. ప్రజాగాయకుడిగా, ప్రత్యేక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి సోమన్న (Yepuri Somanna) నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ అభివృద్ధిలో తానూ భాగస్వామ్యం కావాలని సోమన్న నిర్ణయించుకోవటం శుభపరిణామం అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సందర్భం వచ్చినపుడు తెలంగాణ శక్తులన్నీ ఏకం అవుతాయని చెప్పటానికి ఏపూరి సోమన్న గొప్ప ఉదహరణ అని తెలిపారు. గుంపులు, గ్రూపులతో తెలంగాణకు తీవ్రనష్టం కలుగుతుందని భావించే తాను బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నానని ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న స్పష్టం చేశారు.

 

ఎవరెన్ని చెప్పినా తెలంగాణకు ప్రత్యామ్నాయం.. పర్యాయపదం సీఎం కేసీఆరేనని, అది తన అనుభవం తేల్చిన సత్యమని తెగేసి చెప్పారు. ఇదే తాను బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణమని అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఏపూరి సోమన్న అటు రాజకీయాల్లో.. ఇటు సాంస్కృతిక కళా రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు కుడిభుజంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతాల్లో ఆమె రాజకీయాలు చేయటానికి మార్గదర్శనం చేసిన వారిలో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనతోనూ కొంతకాలం ప్రయాణించారు. తెలంగాణ ఉద్యమంలో గళగర్జన చేసిన కళాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉద్యమంలో, ఉద్యమానంతర సమయంలోనూ తెలంగాణ అంతటా నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజాకళాకారుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు