Sravana Masam Celebrations: శ్రావణమాసంలో శ్రీశైలానికి వెళ్తున్నారా? ఈ రోజుల్లో స్పర్శ దర్శనాలు బంద్, పలు సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో (Srisailam Devasthanam) ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Srisailam, AUG 03: ఈ నెల 5 నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు (Sravana Masam) జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో (Srisailam Devasthanam) ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శ్రావణంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం (Sravana Masam Celebrations) ఉన్నది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఆర్జిత అభిషేకాలు, దర్శనాల వేళ్లలో దేవస్థానం పలు మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు భక్తులకు కేవలం స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి పర్వదినాలతో పాటు సోమవారాలు, వారాంతాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఉత్సవాల సమయంలో 16 రోజుల పాటు గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చన, ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవలను నిలిపివేసింది. అభిషేకాలను నిలిపివేసిన ఐదురోజుల్లో రోజుకు నాలుగు విడుతలుగా స్పర్శ దర్శనాలు కల్పించనున్నారు. గతంలో మాదిరిగానే రూ.500 టికెట్లపై దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రద్దీ సాధారణంగా ఉండే రోజుల్లో యథావిధిగా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు కొనసాగుతాయని ఈవో తెలిపారు.
దర్శన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు srisailadevasthanam.org వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. ఇక ఆలయ ద్వారాలను వేకువ జామున 3 గంటలకు తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి 4.30గంటలకు మహామంగళహారతి సేవ ఉంటుందన్నారు. ఆ తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమం, మంగళవాయిద్యాలు, ప్రదోషకాల పూజలు, మహామంగళహారతి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు.