SSC Paper Leak Case: బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్, చొక్కా విప్పి తన ఒంటిపై గాయాలను చూపించిన బీజేపీ ఎంపీ, టెన్త్ పేపర్ లీక్ కేసులో A1గా సంజయ్
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మెజిస్ట్రేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. బండి సంజయ్‌ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది.
Hyd, April 5: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మెజిస్ట్రేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. బండి సంజయ్‌ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. ఖమ్మం వెళ్లే మార్గంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బండిసంజయ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను కూడా ఖమ్మం జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్‌లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్‌ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనల అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. A2గా బూర ప్రశాంత్, A3గా మహేష్, A4గా బాలుడు, A5గా మోతం శివగణేశ్, A6గా పోగు సుభాష్, A7గా పోగు శశాంక్, A8గా దూలం శ్రీకాంత్, A9గా పెరుమాండ్ల శార్మిక్, A10గా పోతబోయిన వసంత్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.