Hyd, April 5: కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశామని సీపీ రంగనాథ్ తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన.. కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పొగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు
120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చారు. బండి సంజయ్ సహా ప్రశాంత్, మహేష్, శివగణేష్‌లను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. టెన్త్ విద్యార్థికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచే ప్రశ్నపత్రం బయటకు తెచ్చినట్టు దర్యాప్తులో తేలింది. 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద బండి సంజయ్‌పై కేసులు నమోదు చేశాం. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రానికి బాధ్యులపైన శాఖపరమైన చర్యలు తీసుకున్నారని సీపీ వివరించారు.
ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్‌ను పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఏ4గా మైనర్ ఉండటంతో వివరాలు వెల్లడించడం లేదు. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడు. ఈటల సహా చాలా మంది నేతలకు టెన్త్ పేపర్ వెళ్లింది. పరీక్షకు ముందు రోజు ప్రశాంత్, బండి సంజయ్ చాటింగ్ జరిగిందని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
ప్రశాంత్, సంజయ్ మధ్య తరుచూ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. బండి సంజయ్ ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించారు. మెసేజ్ షేర్ చేసినందుకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రపన్నారు. చాటింగ్ ఆధారంగానే బండి సంజయ్‌ను ఏ1గా చేర్చాం. టెన్త్ పేపర్ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది. పేపర్ లీక్‌పై మీడియాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ లభ్యమైతే మరింత సమాచారం తెలుస్తుందని సీపీ పేర్కొన్నారు.
వాట్సాప్ మెసేజ్‌లను రిట్రీవ్ చేస్తున్నాం. పేపర్ లీక్ అంతా గేమ్ ప్లాన్‌లా చేస్తున్నారు. నమో టీమ్‌లో ఏ2 ప్రశాంత్ పని చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేశాం. మేం పక్కాగా లీగల్ ప్రొసీజర్‌నే ఫాలో అయ్యాం. బండి సంజయ్ డైరెక్షన్‌లోనే పేపర్ లీకేజీ వ్యవహారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని సీపీ వెల్లడించారు.
ఎంపీ బండి సంజయ్‌ను ఫోన్ గురించి అడిగితే లేదన్నారు. ఎక్కడుందంటే తెలియదంటున్నారు. ఫోన్ ఇస్తే కీలకమైన సమాచారం బయటకు వస్తుందని వారికి తెలుసు. అందుకే ఫోన్ ఇవ్వట్లేదు. అయినా.. బండి సంజయ్ ఫోన్‌కాల్ డేటా సేకరిస్తాం. పేపర్ షేర్ అయిన అందరికీ ప్రశాంత్ ఫోన్ చేయలేదు. పిల్లల సాయంతో ప్రశ్నపత్రం బయటకు తెచ్చుకున్నారు. కొన్ని పోన్లలో మెసేజ్‌లు డిలీట్ చేశారు.. వాటిని రిట్రైవ్ చేయాలి. కాల్ డేటా సేకరించాల్సి ఉందని తెలిపారు.
ఈ కేసులో సెక్షన్ 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. కక్ష పూరితంగా బండి సంజయ్‌ను అరెస్టు చేశారనేది అవాస్తవం. ఎంపీ సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చాం. కక్ష రాజకీయాలు అయితే మిగతా బీజేపీ నేతలపై కూడా కేసులు పెట్టాలి కదా? ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్ ఫోన్ ఇవ్వొచ్చు కదా?’’ అని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రశ్నించారు.
బండి సంజయ్‌ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్‌లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.
పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్‌ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు.