Hyd, April 5: పదోతరగతి పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్ట్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ (Telangana BKP)పిలుపునిచ్చింది. కాగా ఈ వ్యవమారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు.దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు.
కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు.రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్ రావు విమర్శించారు. పట్టపగలు బండి సంజయ్, బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీశ్ రావు అన్నారు. స్పష్టంగా దొరికిపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు అవసరమా అని బీజేపీ నేతలపై మండిపడ్డారు.
బండి సంజయ్‌పై కుట్ర కేసు నమోదు, భువనగిరి కోర్టుకు తరలింపు, ఈటెల, రఘునందన్ రావు అరెస్ట్
రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీల (Paper Leak) వెనుక బీజేపీ (BJP) నాయకుల హస్తం ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహారమని విమర్శించారు. బలవంతంగా అధికారంలోకి రావాలని కమలం పార్టీ నేతలు మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు.
పదోతరగతి పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక సూత్రధారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalaker) విమర్శించారు. రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో అనేక రకాల పరీక్షలు జరిగాయని, ఎప్పుడూ లీక్ కాని పేపర్లు ఇప్పుడే ఎందుకవుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు.
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీ పేపర్‌ను (Hindi Paper) లీక్ చేసిన బీజేపీ నాయకుడు వెంటనే దానిని ఆ పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్‌కి (Bandi Sanjay) పంపించడం, ఆయన మీడియాకు సమాచారం అందించడం కుట్రలో భాగమేనని చెప్పారు.
బీఆర్‌ఎస్‌తో పోటీపడలేక బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్‌లోనే రాష్ట్ర బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leak) రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని (Bandi Sanjay) తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు.