TS Budget Session 2022: ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, 9వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ, 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను (TS Budget Session 2022) నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Hyd, Mar 7: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను (TS Budget Session 2022) నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 9వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. 10, 11, 12, 14 తేదీల్లో పద్దులపై చర్చించనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. 8, 13వ తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన కాలేజీల ఏర్పాటుకు 2022-23 వార్షిక బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
ఇక తెలంగాణ శాసన మండలికి ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 10న బడ్జెట్‌పై మండలిలో సాధారణ చర్చ చేపట్టనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. సోమవారం శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.