Telangana Assembly Elections 2023: పనిచేయని రాసలీలల వైరల్ ఫోటో వ్యవహారం, బానోత్ మదన్ లాల్‌కే వైరా సీటు అప్పగించిన సీఎం కేసీఆర్
ఈ మధ్య బానోత్ మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
Hyd, August 22: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోత్ మదర్ లాల్ (Banoth Madanlal) అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్య బానోత్ మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకు కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు వస్తుందేమోనన్న అక్కసుతో ఓ మహిళతో ఉన్న మదన్ లాల్ పర్సనల్ ఫోటోలు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం లీక్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవేమి వర్కవుట్ కాలేదు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వైరా టికెట్ బానోత్ మదర్ లాల్ కే కేటాయించారు.
ఫొటోలు వైరల్ కావడంపై మదన్ లాల్ వర్గం ఘాటుగానే సమాధానమిస్తున్నారు. అవి మార్ఫింగ్ ఫొటోలు అని ఆరోపించారు. మదన్‌లాల్‌కే బీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గమే ఈ పని చేయించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై రాములు నాయక్ వర్గం స్పందిస్తూ ఒకరి ఫొటోలను వైరల్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెబుతోంది. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని మదన్‌లాల్ తెలిపారు.
వైరా నియోజకవర్గంలో ఏర్పడినప్పటి నుంచి మదన్ లాల్ వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం విశేషం. 2009 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజనలో వైరా నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. వైరా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి త్వరలో జరగనున్న ఎన్నిక వరకు మొత్తం నాలుగు సార్లు బానోత్ మదన్ లాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
2009 వ సంవత్సరంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ టికెట్ వచ్చినట్లు వచ్చి చివరి సమయంలో చేజారిపోయింది. దీంతో మదన్లాల్ 2009వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా వైరా నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రామచంద్రనాయక్ పై మహాకూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో చంద్రావతికి 53,090, భూక్యా రామచంద్రనాయక్కు 39,464 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మదన్లాల్ కు 5551 ఓట్లు లభించాయి. అయితే 2014 సంవత్సరంలో మదన్ లాల్ కు వైరా నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ లభించింది. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో బానోత్ మదన్ లాల్ టీడీపీ అభ్యర్థి బానోత్ బాలాజీ పై ఘనవిజయం సాధించారు. ఎన్నికల్లో మదన్ లాల్ కు 59,318 ఓట్లు రాగా బాలాజీ నాయక్ 48,735 ఓట్లు లభించాయి.
ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ మారిన రాజకీయ పరిణామాలతో వైరా నియోజకవర్గ అభివృద్ధికి 2014 సంవత్సరంలో అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మదన లాల్ వైరా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. అయితే 2014 నుంచి 2018 వరకు మదన్ లాల్ కు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన లావుడ్యా రాములు నాయక్ కు సిపిఐ పొత్తుల్లో భాగంగా టికెట్ లభించలేదు. వైరా నుంచి సీపీఐ అభ్యర్థిగా భానోత్ విజయభాయి 2018లో పోటీ చేశారు.
దీంతో పొంగులేటి వర్గీయులు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి బంగపడ్డ రాముల నాయక్ ను ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ పై స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ 2013 ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాములు నాయక్ కు 52,650 ఓట్లు రాగా, బానోత్ మదన్ లాల్ కు 50637, విజయబాయికి 32,735 ఓట్లు లభించాయి.
2018లో ఓటమి చెందిన మదన్ లాల్ అనంతరం నియోజకవర్గంలో నిరంతరం పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పలుసర్వేలలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల నాయక్ కంటే మదన్ లాల్ కు సానుకూల వాతావరణ ఉండటంతో సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ను బానోత్ మదన్ లాల్ కు కేటాయించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పడిన తర్వాత వరుసగా నాలుగోసారి మదన్ లాల్ ఎన్నికల బరిలో నిలవనున్నారు.