Telangana Assembly Elections 2023: రూ.500లకే మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంల వివరాలు ఇవిగో

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీలను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభ జరిగింది.

Six Guarantee Card Schemes (Photo-X/Congress)

Hyd, Sep 18: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీలను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభ జరిగింది. విశ్వసనీయతనే అజెండాగా జరిగిన తుక్కుగూడ విజయభేరి సభలో కాంగ్రెస్ (Congress) నిబద్ధతను ప్రజలకు గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాటలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టంచేస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం మధ్య ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. విజయభేరి బహిరంగ సభ విజయవంతంకావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

హైదరాబాదులోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితర జాతీయ స్థాయి నేతలు విచ్చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలతో పోరాడుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నింటితోనూ పోరాడుతోందని వెల్లడించారు. రాజకీయాల్లో మనం ఎవరిపై పోరాడుతున్నామో మనకు తెలిసుండాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌వి వారెంటీ లేని గ్యారెంటీలు, వందరోజుల్లోనే కర్ణాటక ఆగమాగం అవుతోంది, కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్ రావు ఘాటు కౌంటర్

పార్టీలుగా చూస్తే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వేర్వేరుగానే కనిపిస్తాయి... కానీ, ఇవన్నీ కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. లోక్ సభలో కేంద్రం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ పై బీజేపీ ఎలాంటి కేసులు పెట్టదని, ఎంఐఎం నాయకులపైనా ఎలాంటి కేసులు ఉండవని వివరించారు.

Congress Party Announced Six Guarantee Card Schemes For Coming Polls

కేసీఆర్, ఎంఐఎం నేతలను మోదీ తన సొంత మనుషుల్లా భావిస్తారు కాబట్టే వారిపై కేసులు ఉండవని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా సీబీఐ ఇటువైపు తొంగిచూడదని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సోనియాగాంధీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సోనియా ఏం చెబుతారో అది చేసి తీరతారని స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరడం ఖాయమని, మరో 100 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిపోతుందని, బీజేపీ, ఎంఐఎం ఎంత ప్రయత్నించినా దీన్ని అడ్డుకోలేవని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిశ్చయించిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరైన పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని సోనియా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. కౌలు రైతులు సహా ప్రతి పట్టా భూమి రైతుకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని వివరించారు. వరి ధాన్యం క్వింటాల్ పై అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే..

1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్‌ పిలిండర్‌, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌

3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం

5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్‌, రూ. 10 లక్షల వరకూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ భీమా

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now