Telangana Assembly Session: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25వ తేదీన బ‌డ్జెట్, ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

Telangana Assembly Session (Photo-Video Grab)

Hyd, July 23: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

స‌భ ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాగా, లాస్య నందిత మృతిప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా లాస్య నందిత సేవ‌ల‌ను, ఆమె తండ్రి సాయ‌న్న సేవ‌ల‌ను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంత‌రం శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, సునీతా ల‌క్ష్మారెడ్డి, ముఠా గోపాల్, రాజశేఖ‌ర్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, కూనంనేని సాంబ‌శివ‌రావు, ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి, పాయ‌ల్ శంక‌ర్, మ‌క్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గ‌ణేశ్.. లాస్య నందిత మృతిప‌ట్ల సంతాపం ప్ర‌క‌టిస్తూ సీఎం రేవంత్ తీర్మానాన్ని బ‌ల‌పరిచారు.  ఆరోగ్య‌శ్రీ‌లో మార్పులు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం, కొత్త‌గా 163 చికిత్స‌లు చేర్చిన స‌ర్కార్, ట్రీట్ మెంట్ ధ‌ర‌లు కూడా మార్చుతూ నిర్ణ‌యం

ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణ‌యించారు. 25వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు. 31వ తేదీన ద్ర‌వ్య వినిమ‌య బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలుప‌నుంది. రేపు పంట‌ల రుణ‌మాఫీపై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.బీఏసీ స‌మావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు శ్రీధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్, ప్ర‌భుత్వ విప్‌లు, బీఆర్ఎస్ నుంచి హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మ‌హేశ్వ‌ర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబ‌శివ‌రావు, ఎంఐఎం నుంచి బ‌లాల హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు.లాస్య నందిత తండ్రి సాయన్న నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేం కలిసి పనిచేశాం. ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో పనిచేశాం. సాయన్న కంటోన్మెంట్‌ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించడంతో తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్య నందిత ప్రజాజీవితంలోకి వచ్చారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరఫున చిత్తశుద్ధితో పోరాడతారని భావించాం. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. తలకు తీవ్ర గాయమై చనిపోయారని వైద్యులు చెప్పారు. ఆ కుటుంబానికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కంటోన్మెంట్‌ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు. వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేస్తుంది. ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు.

లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్

ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తెలు మృతిచెందడం చాలా బాధాకరమని BRS ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా శాసనసభలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడారు. ‘‘సాయన్న మరణించిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటామని అప్పటి సీఎం కేసీఆర్‌ సభలో హామీ ఇచ్చారు. దాని ప్రకారం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె లాస్య నందితకు అవకాశం కల్పించారు. రాజకీయాలకు అతీతంగా అందరితో సాయన్న కలిసి ఉండేవారు.

తండ్రి ఆశీస్సులు, పార్టీ అండతో నందిత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో లాస్య నందిత తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. అక్కడికి కొద్దిరోజులకే ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదంలో చనిపోయారు. వరుసగా పగబట్టినట్లే ఈ ఘటనలు జరిగాయి. మంచి వ్యక్తిత్వం, విద్యార్హతలు కలిగిన లాస్య నందిత ప్రజలకు ఎంతో సేవ చేస్తారని భావించాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం’’అని కేటీఆర్‌ అన్నారు.