Telangana Assembly Sessions: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, బీసీసీఐతో చర్చలు జరిపామన్న సీఎం రేవంత్ రెడ్డి, మండలానికో మినీ స్టేడియం ప్రతిపాదన
స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు .ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు.
Hyd, Aug 2: గ్రేటర్ హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు .ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు.
స్టేడియం నిర్మాణంలో బీసీసీఐ సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని, స్టేడియం నిర్మాణం కొరకు భూమి కేటాయించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఇక బీసీసీఐ కూడ ఇందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టేడియాలను సినిమా ఫంక్షన్స్‌కి, పెళ్లిళ్లు, పేరంటాలు, రాజకీయ సభలకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ ద్వారా స్పోర్ట్స్ పాలసీపై చర్చిస్తామని తెలిపారు. క్రీడలకు ప్రోత్సహం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువతను గంజాయి మత్తు నుండి దూరం చేయాలంటే క్రీడలు ఒక్కటే సరైన మార్గం అన్నారు.
బాక్సర్ నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 600 గజాల ఇంటి స్థలం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక సిరాజ్‌కు గ్రూప్ 1 ఉద్యోగం పొందే విద్యార్హత లేకపోయిన ప్రత్యేక సవరణ ద్వారా క్రీడలను ప్రోత్సహించాలని ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 361 కోట్లను క్రీడలకు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి...అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, గుత్తా జ్వాలాలకు ఆర్థిక సహాయంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే సైతం పలువురి పేర్లను సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల భేటీ, కాంగ్రెస్‌లోనే కొనసాగే అవకాశం, బీఆర్ఎస్ నేతల నిరాశ