Balkampet Yellamma Kalynam: నేటి నుంచి 3 రోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు, హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

Balkampet Yellamma Kalynam (Photo-Video Grab)

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. సోమవారం ఎదుర్కోళ్లు, మంగళవారం ఎల్లమ్మ కల్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎస్‌ అన్నపూర్ణ తెలిపారు.ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌, అమీర్‌పేట సత్యం థియేటర్‌ నుంచి ఫతేనగర్‌ వైపు వెళ్లే వాహనాలు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌, కమ్యూనిటీ హాల్‌, బీకేగూడ క్రాస్‌ రోడ్డు, శ్రీరాంనగర్‌, సనత్‌నగర్‌ మీదుగా ఫతేనగర్‌ బ్రిడ్జిపైకి వెళ్లాల్సి ఉంటుంది.

ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం

ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి కట్టమైసమ్మ దేవాలయం మీదుగా బేగంపేట వైపు మళ్లిస్తారు. గ్రీన్‌ ల్యాండ్‌, ఫుడ్‌ వరల్డ్‌ మీదుగా బల్కంపేట వైపు వచ్చే వాహనాలను ఫుడ్‌ వరల్డ్‌ క్రాస్‌ రోడ్డు వద్ద దారి మళ్లించి సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్‌, మైత్రి వనం, ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ వైపు అనుమతిస్తారు. బేగంపేట, కట్ట మైసమ్మ దేవాలయం వైపు నుంచి బల్కంపేటకు వచ్చే వాహనదారులు గ్రీన్‌ల్యాండ్స్‌, కనకదుర్గా దేవి దేవాలయం, సత్యం థియేటర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ నుంచి ఎడమవైపు తీసుకుని ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.