Biometric Attendance: విద్యాశాఖ కీలక నిర్ణయం, ఇకపై విద్యార్ధులు, టీచర్లు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనసరి, వెంటనే అమల్లోకి ఉత్తర్వులు, పరికరాలు లేకుండా ఎలా అంటూ సిబ్బంది అయోమయం
ఇప్పటికీ చాలా కాలేజీల్లో బయోమెట్రిక్ పరికరాల్లేవు. ఉన్న చోట సరిగా పనిచేయడం లేదు. ఇలాంటి టైంలో స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వులు జారీ చేయడంపై అయోమయం నెలకొన్నది.
Hyderabad, OCT 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును (Biometric attendance ) తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించింది. అయితే స్కాలర్‌షిప్ (Scholarship), ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు (Biometric attendance) ఉపయోగపడుతుందన్నారు. ఇక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పని చేస్తున్నారు. వారి సెలవులు(Leaves), ఇతరత్రా విషయాలకు కూడా బయో మెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో స్టూడెంట్లు, స్టాఫ్ కు బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలంటూ విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ–పాస్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీఎంబర్స్ మెంట్ కు ఈ అటెండెన్స్ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ అటెండెన్స్ తో పాటు లీవ్స్ కూడా దీనిద్వారానే అప్లై చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీలతో పాటు అన్ని ప్రొఫెషనల్ కాలేజీల్లోనూ ఇది అమల్లోకి వస్తుందన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ (Biometric attendance ) ఈనెల1 నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. 2వారాలు ఆలస్యంగా ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఆలోచన మంచిదే కానీ, దాని ఏర్పాటు, నిర్వహణపై క్లారిటీ లేదు. ఇప్పటికీ చాలా కాలేజీల్లో బయోమెట్రిక్ పరికరాల్లేవు. ఉన్న చోట సరిగా పనిచేయడం లేదు. ఇలాంటి టైంలో స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వులు జారీ చేయడంపై అయోమయం నెలకొన్నది. ఇంటర్ కాలేజీల్లో గతంలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండేది. కరోనా తర్వాత దాన్ని పక్కనపెట్టేశారు. మిగిలిన కాలేజీల్లోనూ ఇదే దుస్థితి. కొత్తగా ఇన్ స్టాల్ చేసేచోట డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధులివ్వకుండా, ఇవన్నీ ఎలా చేయాలో కూడా చెప్పాలని కోరుతున్నారు.