Telangana Bonalu: తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు.. బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో తలసాని సమీక్ష.. ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్ల ఖర్చు
బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో నిన్న బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Hyderabad, May 27: జూన్ 22 నుంచి రాష్ట్రంలో బోనాల పండుగ (Bonalu Festival) ప్రారంభమవుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. బేగంపేటలోని (Begumpet) హరిత ప్లాజా హోటల్‌లో నిన్న బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయ లక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు జరుగుతాయని తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు
గోల్కొండలోని శ్రీజగదాంబిక, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి, పాతబస్తీలోని శ్రీ అక్కన్నమాదన్న ఆలయాలతోపాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వివరించారు.