
Dubai, March 02: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ (Newzeland), దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌తో సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో పోటీ పడనుందో స్పష్టత వచ్చింది. కివీస్ పై విజయంతో భారత్ (Team India)గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనల ప్రకారం గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టును ఢీ కొట్టనుంది.
ఈ నేపథ్యంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో (Semi Final) భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనుండగా, రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఢీ కొట్టనుంది. షెడ్యూల్ ప్రకారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 4న అంటే మంగళవారం దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక మరో సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 5న అంటే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ పాక్‌లోని గఢాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9 జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరగనుందో ప్రస్తుతానికి ఐసీసీ ప్రకటించలేదు. భారత్ ఫైనల్ చేరుకుంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. లేదంటే పాక్‌లో ఫైనల్ జరగనుంది.