Telangana Cabinet Meeting Highlights: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..
ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది
Hyd, July 31: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా కేబినెట్ చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేటీఆర్. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులు, రైతులకు జరిగిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించినట్లు సమాచారం. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులపై చర్చించినట్లు తెలుస్తోంది. మెట్రో రైలు విస్తరణ, కొత్త కారిడార్లకు అనుమతి, బుద్వేల్ భూముల అమ్మకం, వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ధిపై చర్చకు వచ్చినట్లు సమాచారం.
రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బిల్లుల్లో ఏమైనా మార్పులు చేసి తిరిగి ప్రవేశపెట్టాలా? లేదా ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచాలా? అనే విషయాలపై మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇంకా పూర్తి చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏమైనా చేయాలా?అనే విషయాలపైనా సుదీర్ఘంగా కేబినెట్ భేటీలో చర్చ సాగినట్లు తెలుస్తోంది.