తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 35.31 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... 55.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కాగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ 35, యాదాద్రి జిల్లా బీబీనగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపినివ్వడంతో ఎగువ గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్దకు ప్రవాహం 12,79,307 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 56 అడుగుల నుంచి 50.4 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరిలో వరద తగ్గుతోంది.
అమెరికాను వణికిస్తున్న మరో కరోనా వేవ్, ఊహించని స్థాయిలో ఒక్కసారిగా పెరిగిన కేసులు
మరోవైపు, శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 8,100 క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 44,354, పార్వతి బ్యారేజ్ వద్ద 30,150, సరస్వతి బ్యారేజ్ వద్ద 43,615 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ప్రవాహం తక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద సోమవారం మరింతగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.
జూరాలలో..: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు 1,58,655 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 9 గంటల వరకు 37 వేలకు తగ్గడంతో 25 క్రస్టు గేట్లనూ మూసివేశారు. మళ్లీ రాత్రి 8 గంటలకు 68,500 క్యూసెక్కులకు వరద పెరగడంతో 6 గేట్లను తెరిచి 23,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల నుంచి విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా కలిపి 64,474 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 846.90 అడుగుల వద్ద 73.6744 టీఎంసీల నీరు నిల్వ ఉంది.