Telangana Cabinet Meet Highlights: పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, కేంద్రం తెలంగాణ కోసం చేసిందేం లేదు, ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి, సీఎం కేసీఆర్ కేబినేట్ భేటీ హైలైట్స్

కాగా, మంత్రి కేటీఆర్ ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాల్సిందిగా పిలుపునిచ్చారు.....

File image of Telangana CM KCR | File Photo

Hyderabad, February 17: లౌకికత్వానికి తెలంగాణ ప్రభుత్వం సింబల్, కాబట్టి మతపరమైన సిఎఎ చట్టాలకు వ్యతిరేకం. దీనిపై తమ ప్రభుత్వ వైఖరిని పార్లమెంటులోనే తెలియజేశాం, త్వరలో అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తాం, కేంద్రం వెనక్కి తగ్గకపోతే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం సుమారు 7 గంట పాటు సుదీర్ఘంగా జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై విస్తృత చర్చతో పాటు పలు కీలక నిర్ణయాలు టీఎస్ కేబినేట్ తీసుకుంది.

పన్నుల్లో వాటా మినహా తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేం లేదు, రాష్ట్ర బీజేపీ నేతలు తమపై విమర్శలకే పరిమితమయ్యారు. మెట్రోప్రాజెక్ట్ పట్ల కేంద్రహోశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా ఆక్షేపణీయం అని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పథకాల కొనసాగింపుపై అధ్యయనం కోసం కమిటీ వేశారు.

మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు

 

భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన సిటిజెన్ షిప్ (అమెండ్మెంట్) యాక్టును ర్దదు చేయాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని సీఎం ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం- పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని సీఎం పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలైన రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేనిరుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటి కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవింద్ కుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి. హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది

• తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది. త్వరలోనే అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

ఇదిలా ఉండగా, ఈరోజు ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా గులాబీ దండు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున తమ అధినేత జన్మదిన వేడుకలు జరుపుకోటానికి ప్లాన్ చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాల్సిందిగా పిలుపునిచ్చారు.