Telangana: జైల్లో ఖైదీల కోసం వచ్చే మహిళలపై కన్ను, నంబర్ ఇచ్చి రాత్రికి వీడియో కాల్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారి వేధింపులు, ఆయన్ని బదిలీ చేసిన జైళ్లశాఖ డైరెక్టర్
సాధారణంగా నేరాలకు పాల్పడి జైలు పాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్దేశిత సమయం పాటు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు.
Hyd, Nov 2: చర్లపల్లి జైలులో పోలీస్ రూపంలో మహిళలకు కామాంధుడు ఎదురయ్యాడు. సాధారణంగా నేరాలకు పాల్పడి జైలు పాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్దేశిత సమయం పాటు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. అయితే, చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ (Cherlapally Prison official) చింతల దశరథం..ములాఖత్ కు వచ్చే ఖైదీల భార్యలపై ( harassing woman relatives of convict) కన్నేసి, వారిపై వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందాయి.
దశరథం తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఈ వ్యవహారం జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ వద్దకు చేరగా, ఆయన దశరథం తీరుపై తీవ్రంగా స్పందించారు. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న చింతల దశరథంను జైలు అధీనంలోని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. గతంలో జైల్లోని మహిళా సిబ్బందిపైనా దశరథం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.
తాజాగా పెరోల్ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి అనుమతి తొందరగా వచ్చేలా చూడాలంటే.. తనకు వీడియో కాల్ చేయాలంటూ ఖైదీ సోదరిని ఈ జైలు అధికారి వేధింపులకు గురి చేశాడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ బాషా అనే ఖైదీ చర్లపల్లి కేంద్రకారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి పెరోల్ అవకాశం లభించింది. అయితే, త్వరగా ప్రక్రియ పూర్తికావాలంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం ఖైదీ సోదరికి ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టాడు.
దీని గురించి జైల్లో ఉన్న సోదరుడికి చెప్పుకొని ఆమె విలపించింది. తమ కుటుంబసభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పర్యవేక్షణాధికారి సంతోష్‌రాయ్‌కి గత నెల 26న ఖైదీ ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులు వాస్తవమేనని విచారణాధికారి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. ఫర్నీచర్ తదితర జైలు ఉత్పత్తుల అమ్మకాలలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు దండుకుంటున్నారని, దీన్ని అడ్డుకుంటున్న తనపై లేనిపోని అభాండాలు ప్రచారం చేస్తున్నారని దశరథం ఆరోపించారు