KCR On TSRTC Strike: తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ, విలీనం ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్, సమ్మెలో పాల్గొన్న సిబ్బందికి ఇకపై సంస్థతో సంబంధం లేదని వెల్లడి
ఇకపై ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ పద్ధతిలో చర్యలు చేపడితే రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది అని సీఎం అన్నారు. 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు....
Hyderabad, October 07: టీఎస్ ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM K. Chandrashekhar Rao) అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం కన్నెర్ర జేశారు. ఏటా రూ.1,200 కోట్ల నష్టం, దానిపై రూ. 5,000 కోట్ల రుణభారం ఆపై క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, సంస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మె చేస్తూ, అదీ పండుగల సీజన్లో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది తీవ్రమైన తప్పిదమని సీఎం కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (RTC Merge) చేసే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. సమ్మె చేస్తున్న కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు.
సమ్మెల్లో పాల్గొన్న సిబ్బంది స్థానంలో కొత్త సిబ్బంది నియామకం
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోవాలంటే, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు.
ప్రభుత్వం విధించిన గడువులోపల విధుల్లోకి హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేరబోయే సిబ్బంది ఏ యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బంది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎం అన్నారు. ఏఏ కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటగిరీలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం ఉంటుందని సమావేశం అనంతరం సీఎం వెల్లడించారు
భవిష్యత్ లో కూడా ఆర్టీసీకి సంబంధించి, క్రమశిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా నిర్మూలించేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని సీఎం తెలిపారు. టీఎస్ ఆర్టీసీ సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ఆదేశం, చదవండి.
తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4,114 ప్రయివేట్ బస్సులు ఇంకా ఉన్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారు.
టీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ
టీఎస్ ఆర్టీసీ అర్ధభాగం ప్రైవేట్ భాగస్వామ్యం మరో అర్ధభాగం ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటేనే సంస్థ నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇకపై ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ పద్ధతిలో చర్యలు చేపడితే రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది అని సీఎం అన్నారు. 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఆర్టీసీ విలీనంపై ప్రతిపక్షాలకు అర్హత లేదని కేసీఆర్ అన్నారు, ఇప్పుడు విలీనంపై మాట్లాడే ఏ పార్టీ కూడా తాము పాలించే రాష్ట్రాలలో ఎక్కడ విలీనం చేయలేదని తెలియజేశారు.మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేదు. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ మాటలని బట్టి చూస్తే ఆయన టీఎస్ ఆర్టీసీని కొంతవరకు ప్రైవేటీకరణ చేస్తేనే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతుంది, ఈ నేపథ్యంలోనే ఆయన విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
దీనిపై కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సోమవారం రోజు ప్రభుత్వం ముందుకు కొన్ని ప్రతిపాదనలు తీసుకురానుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)