Farm Sectors in TS: రైతులు పంటను అమ్ముకోవటానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక, కొత్త చట్టాలతో ఆదాయం రాకపోయిన రాష్ట్రంలోని మార్కెట్ల బలోపేతానికి సీఎం కేసీఆర్ సూచనలు

రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి.....

TS CM KCR | Photo: CMO

Hyderabad, January 25: తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ కాగితం - కలం శాఖగా కాకుండా పొలం - హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్ శాఖ పై ఉందని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

పదిరోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలనీ, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రగతిభవన్ లో జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్, అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను సీఎం వివరించారు.

“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తుంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

“రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాల పై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాల పై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం సమావేశానికి సంబంధించి ముఖ్యాంశాలు:

 

➧ అన్ని రైతు వేదికలను వెంటనే ఉపయోగంలోకి తేవాలి. ఏఈఓ, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలి. రైతు వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. మైక్ సెట్ సమకూర్చాలి. ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. ఏ క్లస్టర్ లో ఐనా ఏ కారణం చేతనైనా ఏఈఓ పోస్టు ఖాళీయైన, ఎవరైనా దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి.

➧ రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణ రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్కెంటింగ్ శాఖను మరింత బలోపేతం చేసుకోవాలి. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తాం.

➧ రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నది అనే వివరాలు సేకరించాలి. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటి పై రైతులకు అవగాహన కల్పించాలి.

➧ యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది.

➧ మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.

➧ ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్ పర్యటించాలి.

➧ పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.

➧ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి.

➧ వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

➧ మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now