Azadi Ka Amrit Mahotsav: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో 75 వారాల పాటు వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో మార్చి 12 నుంచే వేడుకల ప్రారంభానికి ఆదేశాలు
25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి . రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు,....
Hyderabad, March 9: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట జరపనున్న ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నాటి భారత స్వాతంత్య్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని సీఎం అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని సీఎం పేర్కొన్నారు.
12 మార్చి, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి . రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమీషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్కృతిక శాఖ డైరక్టర్ లు ఉంటారని సీఎం తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేయాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను విధి విధానాలను లక్ష్యాలను ప్రధాని వివరించారు. ఆయా రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
ప్రధానితో వీడియో కాన్పరెన్స్ అనంతరం.. కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం, సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉత్సవాల్లో భాగంగా మార్చి 12న, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో, వరంగల్ పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్., వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లు పాల్గొంటారు. 12 మార్చి న ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం తదితర దేశభక్తి కార్యక్రమాలుంటాయని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపాలని సీఎం సూచించారు.
‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవా’లను ఘనంగా, పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులను, అమరవీరులను స్మరించుకుని జోహారులర్పించాలన్నారు. 75వ స్వాతంత్య్ర ఉత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్ లో ఉన్న జాతీయ పతాకం తరహాలో, తెలంగాణ వ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేయాలని సీఎం తెలిపారు. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు, వంటి దేశభక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.