CM KCR Meeting With RTC Staff: ఈ ఆదివారం అందరూ లంచ్‌కి రండి! ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి సమావేశం, ప్రతి డిపో నుంచి ఐదుగురికి ఆహ్వానం, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
లంచ్ తర్వాత కార్మికులతో ....
Hyderabad, November 29: రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికుల (TSRTC Workers) తో ఈ ఆదివారం, డిసెంబర్ 1న హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ (Pragathi Bhavan)లో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) నిర్ణయించారు.
ప్రతి డిపో నుండి ఐదుగురు సభ్యులను ఆహ్వానించాలని మరియు వారు సమావేశానికి హాజరు కావడానికి తగిన ప్రయాణ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మను సీఎం ఆదేశించారు.
ఒక్కో డిపో నుంచి వచ్చే ఐదుగురు సభ్యుల బృందంలో ఇద్దరు సభ్యులు మహిళా కార్మికులు తప్పనిసరిగా ఉండాలని, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.
కార్మికులందరూ డిసెంబర్ 1, మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతి భవన్‌కు చేరుకునేటట్లుగా చూడాలని, వారికి ఇక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లంచ్ తర్వాత కార్మికులతో నేరుగా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలను, కార్మికుల సమస్యలను సీఎం వారితో కూలంకషంగా చర్చించనున్నారు.
ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా, ఆర్టీసీ ఎండి, ఇడిలు, ఆర్‌ఎంలు, కార్పొరేషన్‌కు చెందిన డివిఎంలు కూడా పాల్గొంటారు.
ఇదిలావుండగా, ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేరడానికి అనుమతించినందుకు మంత్రి అజయ్ కుమార్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన, కార్మికులతో నేరుగా చర్చలు జరపే సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ మనుగడ కోసం సీఎం చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయని మంత్రి తన సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.