PV Centenary Celebrations: పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ప్రకటించాలి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరు పెట్టాలని నిర్ణయం
అలాగే హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని...
Hyderabad, August 28: వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్‌కు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. పివి మెమోరియల్ ను కూడా హైదరాబాద్ లో నిర్మించే ప్రతిపాదనలు ఉన్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త. ప్రపంచం గుర్తించిన మహామనిషి. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తాం. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీ గురించి విస్తృత చర్చ చేయాలని నిర్ణయించాం. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తాం. అసెంబ్లీలో పివి నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం – చిత్తరువు) పెట్టాలని నిర్ణయించాం. భారత పార్లమెంటులో కూడా పీవీ పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. హైదరాబాద్ లో పీవీ నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
‘‘ప్రజలకు కేవలం భూమి మాత్రమే ఉపాధి మార్గం అయిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావు అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలు చేశారు. దీని ఫలితంగా నేడు తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. పేదల చేతికి భూమి వచ్చింది. పీవీ ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా నేడు దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంది. అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్ధతుల్లో స్మరించుకోవాలి’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలి’’ అని సీఎం కమిటి సభ్యులకు సూచించారు.
సీఎం సమీక్షలోని హైలైట్స్
• నెక్లెస్ రోడ్ ను పీవీ జ్ఞాన మార్గ్ గా అభివృద్ధి చేయాలి. ఆ మార్గమంతా అందమైన ఉద్యానవనాలు నిర్మించాలి. పీవీ విగ్రహం పెట్టాలి.
• పీవీ జన్మించిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలి. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రణాళిక తయారు చేయాల్సిందిగా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సీఎం ఆదేశించారు.
• హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేయాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ జీవితమంతా వివిధ రంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా మెమోరియల్ ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.
• పీవీ పేరు మీద విద్యావైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించాలి. అవార్డుకు సంబంధించిన నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
• పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిర్వహించాలి. ఇప్పటికే అమెరికా, సింగపూర్, సౌతాఫ్రికా, మలేసియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా దేశాల్లో కూడా కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించాలి.
• పీవీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ దేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షులు జాన్ మేజర్, కామెరూన్ తదితరులను కూడా భారతదేశానికి ఆహ్వానించి, శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా చేయాలి.
• భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం కేసీఆర్ స్వయంగా లేఖలు రాస్తారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తారు.
• ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పీవీ విగ్రహం పెట్టాలి. ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పీవీ ఎక్కువ అనుబంధం, అక్కడి వారితో పరిచయాలు ఉన్న నేపథ్యలో ఆయా ప్రాంతాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి.
•పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరుఫున ముద్రించాలి. వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలతో ప్రత్యేక పుస్తకం తీసుకురావాలి. పీవీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతులకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక పుస్తకం ముద్రించాలి. పీవీ జీవిత విశేషాలతో కాఫీ టేబుల్ బుక్ తయారు చేయాలి.
• పీవీ జీవిత విశేషాలకు సంబంధించి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించాలి. తెలంగాణ సంబురాలు నిర్వహించిన తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుత వంటకాలతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించాలి.
ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేంధర్, శ్రీనివాస గౌడ్, పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటి అధ్యక్షుడు కే.కేశవ రావు సహా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.