Ambedkar Statue in Hyd: హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం, ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ఆవిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Hyd, April 14: హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు. అంబేద్కర్ విగ్రహా శిలాఫలకాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు.
Here's Video
ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహ రూపకల్పనపై రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్, ముఖ్య నేతలు తిలకించారు. అంబేడ్కర్ జీవిత విశేషాల ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా వీక్షించారు.
Here's Statue Visuals
అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కలియదిరిగారు. వెంట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలంతా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ, లైబ్రరీ తదితరాలను వీక్షించారాయన.అంబేద్కర్ మహా కాంస్య విగ్రహం కోసం 11.80 ఎకరాల విస్తీర్ణం జాగా, రూ. 146 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ పీఠం 50 అడుగులు పార్లమెంట్ భవనం ఆకారంలో ఏర్పాటు చేయగా.. బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులతో ఏర్పాటు చేశారు. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్.
విగ్రహ విశేషాలివే..
దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ స్మారకం ఖ్యాతి గడించింది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహం ఇది. పీఠం లోపల మ్యూజియం, గ్యాలరీ, ఆడియో విజువల్ గది కూడా ఏర్పాటు చేశారు. రూ.146.50 కోట్ల అంచనా వ్యయంతో విగ్రహ ఏర్పాటుకు ఏప్రిల్ 14, 2016లో శంకుస్థాపన జరగ్గా.. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా నేడు విగ్రహావిష్కరణ జరిగింది. హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహ తయారీకి 360 మెట్రిక్ టన్నుల ఉక్కు, 114 టన్నుల లోహంతో విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం చుట్టూ 2.93 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..
ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదని, అంబేద్కర్ విశ్వ మానవుడని.. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలి నుంచి ఆయన ప్రసంగించారు.
ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది. అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వనీనమైనది. అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్. అంబేద్కర్ చెప్పింది ఆచరించేది ఉందా? లేదా? అని ఈ సందర్భంగా ఆయన అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు..
అందరూ అంబేద్కర్ చెప్పిన మాటలు ఆచరించాలి. ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకెళ్లాలి. ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం. అంబేద్కర్‌ను చూడగానే అందరి మనసూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. విగ్రహ ఏర్పాటునకు కృషి చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అని సీఎం కేసీఆర్ తెలిపారు.
సెక్రటేరియెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాగే అంబేద్కర్‌పేరిట శాశ్వత అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా అంబేద్కర్ జయంతి రోజు అవార్డుల ప్రదానం చేస్తాం. ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందిస్తాం. ఇందుకోసం దాదాపు రూ. 50 కోట్లతో అంబేద్కర్ అవార్డు నిధి ఏర్పాటు చేస్తాం అని సీఎం కేసీఆర్ సభాస్థలి నుంచి ప్రకటించారు.
పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి. దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. దళితుల ఆర్థికాభావిృద్ధికి దళిత బంధు పథకం తీసుకొచ్చాం. కేసీఆర్ జాతీయ నేతగా ఎదగాలని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. దేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే రాజ్యం మనదే. మహారాష్ట్రలో ఊహించని ఆదరణ వస్తుంది. యూపీ, బీహార్, బెంగాల్‌లో కూడా ఆదరణ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తాం అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.