Singareni Coal Blocks: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్, బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి, 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్, ప్రధాని మోదీకి లేఖ రాసిని సీఎం కేసీఆర్

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలాన్ని (Singareni Coal Blocks Auction) వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి

Telangana's Singareni ( photo-facebook)

Singareni, Dec 9: సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి (PM Narendra Modi) నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలాన్ని (Singareni Coal Blocks Auction) వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకభూమిక పోషిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తన లేఖలో పేరొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ జూన్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్తు ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులను మంజూరుచేసిందని, దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని ప్రధానికి సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) గుర్తుచేశారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రెంచ్‌-13 కింద వేలం వేయదలచిన జేబీఆర్వోసీ-3, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే -6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలో బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటి వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించవలసిందిగా సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.

తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్, సర్వీసులను క్రమబద్ధీకరించే జీవో 16 అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం

సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల (Singareni Coal Blocks) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది. టీబీజీకేఎస్‌ తోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంసీ, బీఎంఎస్‌, సీఐటీయూ వంటి జాతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఉదయం మొదటి షిప్ట్‌ నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో కోల్‌బెల్ట్‌ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె మూడురోజులపాటు కొనసాగనుంది. ఈ సమ్మెలో సుమారు 40 వేల మందికిపైగా సింగరేణి కార్మికులు, మరో 25 వేల మంది వరకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.

తెలంగాణలో కొత్తగా 205 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు

సింగరేణి పరిధిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలనేది ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆ సంస్థ ఇక్కడ సర్వే లాంటి వాటిని నిర్వహించింది. తమకే కేటాయించాలని సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టిన కేంద్రం.. కావాలనే కేకే-6, సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రావణపల్లి, కేవోసీ బ్లాక్‌-3లను వేలం వేయాలని నిర్ణయించింది.